US Tragedy | అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని బాపట్లకు చెందిన యువకుడు మృతిచెందాడు. అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆవుల పూర్ణగోపీ (35) అమెరికాలో స్థిరపడ్డాడు. న్యూ మెక్సికోలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల శ్రీనివాసరావు తన భార్య, చిన్న కుమారుడితో కలిసి గోపీని చూసేందుకు అమెరికా వెళ్లాడు.
మంగళవారం నాడు పూర్ణగోపీ తన కుటుంబంతో కలిసి వెళ్తుండగా.. వారి కారును వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూర్ణగోపీ మృతిచెందగా.. తండ్రి శ్రీనివాసరావు, తల్లి, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.