బీజింగ్: అగ్రదేశాలు రష్యా, చైనా నుంచి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అణ్వాయుధాలను పరీక్షించాలని ఆయన ఆదేశించారు. అమెరికా రక్షణ శాఖకు ఆ ఆదేశాలు ఇచ్చారు. న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్‌ను మళ్లీ మొదలుపెట్టాలన్నారు. రష్యా, చైనా నుంచి వ్యూహాత్మక పోటీ నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ తాజా ఆదేశాలు ఇచ్చారు. దక్షిణ కొరియాలోని బూసాన్‌లో జరుగుతున్న సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కలవడానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా అణ్వాయుధాలను పరీక్షించినట్లు పుతిన్ పేర్కొనడం కూడా ట్రంప్‌ను పరోక్షంగా వత్తిడికి గురి చేసినట్లు అర్థమవుతోంది.
తమ వద్ద భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయని, మరే దేశం వద్ద అన్ని లేవని, తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఆయధాలను అప్డేట్ చేశామని, కానీ ఆ ఆయుధాలతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున వాటిని పక్కనపెట్టేశామని, కానీ ఇప్పుడు మరో ఛాయిస్ లేదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రుత్‌లో పేర్కొన్నారు. అణ్వాయుధాల రేసులో రష్యా రెండో స్థానంలో, చైనా మూడవ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే మరో అయిదేళ్లలో చైనా తమను అందుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, అందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌ను అణ్వాయుధాలు పరీక్షించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. తొందరలోనే ఆ ప్రక్రియ మొదలవుతుందన్నారు.
1992లోనే అమెరికా అణ్వాయుధాల పరీక్షలను నిలిపివేసింది. అప్పట్లో మారటోరియం విధించారు. అయితే ఆ నాటి నిర్ణయాన్ని ఎత్తివేయాలని ఇటీవల ట్రంప్ క్యాబినెట్ డిస్కస్ చేసింది. రష్యా, చైనా దేశాలు అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ పరీక్షలు చేపడుతున్న నేపథ్యంలో తాము కూడా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు చేపట్టాలని క్యాబినెట్ భావించింది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అమెరికా వద్ద 5177 న్యూక్లియర్ వార్‌హెడ్స్, రష్యా వద్ద 5,459 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే 2035 నాటికి చైనా వద్ద కూడా 1500 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరిలో అమెరికా న్యూక్లియర్ పవర్ మినట్‌మ్యాన్ ఖండాంతర క్షిపణి పరీక్షించింది. సెప్టెంబర్‌లో ఓ జలాంతర్గామి నుంచి నాలుగు ట్రైడెంట్ 2 మిస్సైళ్లను టెస్ట్ చేసింది.