హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అత్యంత అధునాతమైన ప్రాంగణంలో ఒకేసారి 54 కౌంటర్లలో వీసాలను ప్రాసెసింగ్ చేసేలా అమెరికా కాన్సులేట్ కార్యాలయం రూపుదిద్దుకొంటున్నది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సుమారు 12.2 ఎకరాల స్థలంలో రూ.2251 కోట్ల వ్యయంతో కాన్సులేట్‌ను నిర్మిస్తున్నారు. నవంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి కావచ్చని భావిస్తున్నారు. అమెరికా నిర్మిస్తున్న కాన్సులేట్లలో ఆగ్నేయాసిలోనే ఇది అతి పెద్దదని పేర్కొంటున్నారు. దరఖాస్తుల పరిశీలనలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కేంద్రంగా ఇది మారనుంది. ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తరువాత వీసా అపాయింట్మెంట్స్, ఇంటర్వ్యూ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరగనున్నది. దీంతో వీసా ఆమోదం తర్వాత పాస్‌పోర్టు తిరిగి ఇచ్చే వ్యవధి మరింత తగ్గుతుంది. ప్రస్తుతం బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో 2008 నుంచి అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడ 14 కాన్సులర్ విండోస్ ఉండగా, కొత్త కార్యాలయంలో వాటిని 54కు పెంచనున్నారు. అదేవిధంగా ఇక్కడ 150 డెస్కులు ఉండగా, వాటిని 255 డెస్కులకు పెంచనున్నారు. దీంతో వీసాల జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందని, అమెరికా వెళ్లాలనుకొనే వారికి వేచి చూసే సమయం తగ్గుతుందని భావిస్తున్నారు.