సూర్యాపేట, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో రోజుకు 6 వేల నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తుండగా.. ప్రస్తుతం జిల్లాలో యూరియా నిల్వలు జీరోకు చేరుకున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు స్టాక్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.
శనివారం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల రైతులు క్యూలైన్లలో నిలబడగా మరికొన్ని చోట్ల క్యూలైన్లలో చెప్పులు కనిపించాయి. యూరియా దొరకడం లేదని కడుపు మండిన రైతులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. ఆత్మకూర్.ఎస్ మండలం నెమ్మికల్, మునగాల మండలం తాడ్వాయి, నేరేడుచర్ల, తుంగతుర్తి, పాలకవీడు తదితర మండలాల్లోని పీఏసీఎస్‌ల ఎదుట రైతు లు ఆందోళనకు దిగారు.
గత బీఆర్ఎస్ హయాంలో వానాకాలం సీజన్లో నిత్యం దాదాపు పది వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రాగా ప్రస్తుతం నెల రోజులుగా ప్రతి మూడు నాలుగు రోజులకోసారి 350 నుంచి 400 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో బఫర్ స్టాక్‌తో ఇస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో మాదిరి ఈసారి కూడా వానాకాలం సీజన్‌కు జిల్లాకు 47 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు జిల్లాకు 22 వేల మెట్రిక్ టన్నులకు మించి రాలేదు. శనివారం నాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
జిల్లాలోని దాదాపు 15 నుంచి 20 ప్రాంతాల్లో పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం క్యూలైన్లు కనిపించాయి. జిల్లా పరిధిలో 47 ప్రాథమిక సహకార సొసైటీలు, 32 సబ్‌సెంటర్లు ఉండగా శనివారం 80 శాతం ఖాళీగా దర్శనమివ్వగా మిగిలిన చోట్ల 50 నుంచి 100 బస్తాలు ఉంటే వాటిని రైతులకు ఇవ్వడంతో ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల అతి తక్కువ స్టాక్ ఉండగా ఒకటి రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. దీంతో రెండు బస్తాలను ఎక్కడ చల్లుకోవాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. ఆదివారం నుంచి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనితెచ్చుకున్నది కష్టాలు పడేందుకేనా అంటూ సర్కారుపై శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో జగదీశ్‌రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ యూరియా కోసం ఎదురు చూసే పరిస్థితి లేదని, ఊర్లో ఉండి ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆటోలో యూరియా ఇంటికి వచ్చేదని రైతులు చెబుతున్నారు. ఇవ్వాళ కూడా జిల్లాలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నాడని, యూరియా మాత్రం దొరకడం లేదని, రైతుల పట్ల ఆయనకు కనికరం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సీజన్‌కు సరిపడా యూరియా తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత
కోదాడ, ఆగస్టు 30: యూరియా కోసం మునగాల మండలం తాడువాయి పీఏసీఎస్ ఎదుట శనివారం రైతులు ఆందోళన చేశారు. రెండు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా యూరియా సరఫరా చేయడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు బస్తా యూరియా ఇస్తే ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆం దోళనలో టీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్‌కుమార్, తొ గరు ర మేశ్, కందిబండ సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో యూ రియా కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు. సగానికిపైగా పంటలకు యూరియా చల్లాల్సి ఉం దన్నారు.
టీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రైతుల అవసరానికి సరిపడా యూ రియా సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి న రేవంత్‌రెడ్డి ఇప్పుడు చేతకాక చేతులెత్తేసారని విమర్శించారు. టీఆర్ఎస్ను విమర్శించటం తప్ప ఆయన రాష్ర్టానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా యూరియాను అందుబాటులో ఉంచకపోతే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
వచ్చింది గోరంత.. కావాల్సింది కొండంత
నేరేడుచర్ల, ఆగస్టు 30 : కేసీఆర్ సీఎంగా ఉన్న పది సంవత్సరాల కాలంలో ఏనాడూ యూరియా కొరత లేదు. పండుగ వాతావరణంలో వ్యవసాయం సాగు చేసుకున్న నాటి రైతులకు కాంగ్రెస్ పాలనలో తిప్పలు తప్పడం లేదు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి పీఏసీఎస్ వద్ద శనివారం తెల్లవారుజామునే యూరియా కోసం రైతులు బారులు తీరారు. పొసైటీకి యూరియా లారీ వచ్చిందని తెలియడంతో రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వచ్చింది 444 బస్తాల యూరియా.. అక్కడికి చేరుకున్న రైతులు మాత్రం వందల్లో ఉండటంతో యూరియా కోసం ఎగబడ్డారు. చిల్లేపల్లి సొసైటీ పరిధిలో కావాల్సిన యూరియా కొండంత ఉండగా.. వచ్చింది మాత్రం గోరంతే. సొసైటీకి మొత్తం 600 టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 300 టన్నుల మాత్రమే వచ్చింది. ఇంకా 300 టన్నుల రావాల్సి ఉంది.
శాలిగౌరారంలో రైతుల ధర్నా
శాలిగౌరారం, ఆగస్టు 30 : మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల వద్ద యూరియా కోసం ప్రతి రోజూ రైతులు ఎదురు చూస్తున్నారు. శనివారం యూరియా అందుబాటులో లేకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నకిరేకల్-గురజాల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు తక్షణమే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 30 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలతో ట్రాఫిక్ జామైంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.
యూరియా కోసం రైతుల తండ్లాట
దామరచర్ల, ఆగస్టు 30: మండల కేంద్రంలోని నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ వద్ద శనివారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చింది. కొద్దిమందికి మాత్రమే యూరియా అందడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. మండలంలో మొత్తం 21 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందుకు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది.
ఇప్పటి వరకు 1,112 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే వచ్చింది. నాలుగు రోజులకోసారి వస్తున్న 20 టన్నుల యూరియా రైతులకు సరిపడా అందడం లేదు. పీఏసీఎస్‌కు గత ఏడాది 400 టన్నుల యూరియా రాగా… ప్రస్తుతం 160 టన్నులు మాత్రమే వచ్చింది. పది రోజులుగా ఒక్క లోడ్ యూరియా పంపలేదు. తండాలు, గ్రామాల సన్న చిన్నకారు రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. మునుముందు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లవారుజామున నుంచే పడిగాపులు
ఆత్మకూర్.ఎస్, ఆగస్టు 30 : నెమ్మికల్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో తెల్లవా రుజామున 3గంటల నుంచే రైతులు యూ రియా కోసం పడిగాపులు కాస్తున్నారు. సహకార కేంద్రంలో ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. సొసైటీల ముందు నిలబడే ఓపిక లేక క్యూలైన్లలో చెప్పులు, బస్తాలు, పాసు పుస్తకాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎసీఎస్ తెరవగానే రైతులు యూరియా కోసం ఎగబడ్డారు.
మరో క్లస్టర్ అయిన నాగార్జున గ్రామీణ సొసైటీకి 211 బస్తాలు వస్తే… నెమ్మికల్ సొసైటీలో 211 బస్తాలు దిగుమతి అయ్యాయి. ఈ రెండు సొసైటీల్లో దిగుమతి అయిన రెండు గంటల్లోనే యూరియా అయిపోయిందని చెప్పడంతో రైతన్నలు కంటతడి పెడతున్నారు. సొసైటీల ఎదుటే పోలీసులను పెట్టి మరీ రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది.
యూరియా కోసం భారీగా వచ్చిన రైతులు
పాలకవీడు, ఆగస్టు 30 : పాలకవీడు పరపతి సంఘంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు ఒక్కసారిగా యూరియా కోసం ఎగబడ్డారు. శనివారం ఉదయం నుంచే పరపతి సంఘ కార్యాలయంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు యూరియా కోసం బారులుదీరారు. కొంత సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా మండల కేంద్రంలో కేవలం ఒకే ఒక పరపతి సంఘం వుంది.
పలు గ్రామాల్లో ప్రైవేట్ ఎరువుల వ్యాపారులు ఒక బస్తాకు రూ.350 నుంచి రూ.380 వరకు వసూలు చేస్తున్నారు. గుళికలు, పురుగు మందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని చెబుతున్నారు. దీంతో దిక్కతోచని రైతులు పరపతి సంఘ కార్యాలయం ఎదుట బారులుతీరారు. అధికారులు క్యూలైన్లో ముందు ఉన్న రైతులు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. రెండు రోజుల్లో మరింత యూరియా వస్తుందని నచ్చజెప్పి రైతులను పంపించారు.
రెండొందల బస్తాలు..వందలాది రైతులు
కోదాడ రూరల్, ఆగస్టు 30: యూరియా వచ్చిందనే సమాచారం గ్రామాల్లోని రైతులకు అందడంతో పనులు మానుకుని తెల్లవారు జాము నుంచే ఎరువుల గోదాముల వద్ద పడిగాపులు పడుతున్నారు. మండలంలోని తొగర్రాయి, కాపుగల్లు, తమ్మరబండపాలెం గ్రామాల్లోని పీఏసీఎస్ గోదాములకు యూరియా లోడు వస్తోందన్న సమాచారంతో రైతులు కార్యాలయాల ఎదుట పడిగాపులు పడుతూ ఎదురు చూస్తున్నారు. శనివారం కేవలం 200 బస్తాల యూరియా మాత్రమే రావడంతో ఇది ఎంతమందికి సరిపోతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చేసింది వందల ఎకరాలైతే 200 బస్తాలు ఎలా సరిపోతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుంగతుర్తిలో రైతుల ధర్నా
తుంగతుర్తి, ఆగస్టు 30 : తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు గంటల తరబడి దుకాణాల ఎదుట క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, మహిళా రైతులు, అఖిలపక్ష నాయకులు తాటికొండ సీతయ్య, కోట వీరస్వామి, గాజుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెల్లవారుజాము నుంచే భారీ క్యూ..
త్రిపురారం, ఆగస్టు 30: మండలంలో మూడు పీఏసీఎస్‌లు ఉన్నప్పటికీ యూరియా కొరత వెంటాడుతూనే ఉంది. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద 600 మంది రైతులు తెల్లవారు జాము నుంచే యూరియా కోసం తండ్లాడుతూనే ఉన్నారు. 440 బస్తాల యూరియా మాత్రమే రావడంతో వ్యవసాయాధికారులు, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో ఒక్కొక్కరికీ రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అయినప్పటికీ యూరియా దొరక్క చాలా మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. తెల్లవారు జాము నుంచే మహిళా రైతులు కూడా క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.