– మ్యాపింగ్ కాక సుజాతనగర్‌కు పరుగులు
– దూరభారం, స్టాక్ కొరతతో రైతుల ఆవేదన
చుంచుపల్లి, సెప్టెంబర్ 01 : రైతులకు ఎరువుల బుకింగ్‌ను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Framework for Fertilizer Sale (FFS) విధానం చుంచుపల్లి మండల రైతులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మండల మ్యాపింగ్ సర్వర్‌లో పూర్తికాక పోవడంతో చుంచుపల్లి మండలం చూపించడం లేని కారణంగా యూరియా, డీఏపీ, 20:20 తదితర ఎరువుల కోసం రైతులు సుజాతనగర్ మండలంలో బుక్ చేసుకుని వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల యాప్‌లోనూ ఇదే తరహా సమస్య తలెత్తిందని రైతులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఇతర మండలాలకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవాల్సి వచ్చిందని, మంత్రులు కలుగజేసుకుని అధికారులపై ఒత్తిడి అనంతరం చుంచుపల్లి మండల మ్యాపింగ్ అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఏవో రాజేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా పది జిల్లాల్లో ఈ విధానం అమలవుతోందని, సాంకేతిక సమస్య కారణంగా చుంచుపల్లి మండల మ్యాపింగ్ పూర్తి కాలేదని దీంతో యాప్ లో చుంచుపల్లి మండలం చూపించడం లేదని తెలిపారు. మ్యాపింగ్ అనేది తమ చేతుల్లో ఉండదని, హైదరాబాద్ లేదా ఢిల్లీ నుండి జరగాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామన్నారు.
మ్యాపింగ్ సమస్యను వెంటనే పరిష్కరించి చుంచుపల్లి మండలంలోనే ఎరువుల బుకింగ్, విక్రయ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా చుంచుపల్లి తండా వద్ద గల కొత్తగూడెం పీఏసీఎస్‌లో యూరియా, డీఏపీ, 20:20 తదితర ఎరువులను తగినంత స్టాక్‌తో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.