Ravi Teja Irumudi | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.180 కోట్ల వసూళ్లను రాబట్టగా.. రూ.200 కోట్ల దిశగా దూసుకెళుతూ రవితేజ కెరీర్లో మొట్టమొదటి రూ.200 కోట్ల సినిమాగా రికార్డు నమోదు చేయబోతుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి రవితేజ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే రవితేజ, ‘ఇరుముడి’ సినిమాకు మాత్రం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమా పట్ల ఉన్న నమ్మకంతో ఒక రిస్క్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకు రెమ్యూనరేషన్‌కు బదులుగా తెలంగాణ (నిజాం) థియేట్రికల్ రైట్స్‌ను రవితేజ కోనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో సినిమా విడుదలైన తర్వాత ఊహించని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీనివల్ల కేవలం తెలంగాణ రైట్స్ రూపంలోనే రవితేజకు దాదాపు రూ. 50 కోట్ల వరకు షేర్ దక్కినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలా ఒకే ఒక్క రిస్క్‌తో రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తపై అటు రవితేజ టీమ్ కానీ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.