హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయిలో అత్యుత్తమ నగరాలు, పట్టణాలకు ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్, పారిశుద్ధ్య అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. సఫాయి మిత్ర సురక్ష పథకంలో దేశంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా రెండోస్థానంలో నిలిచింది. పరిశుభ్రమైన నగరాలుగా పలు నగరాలు, పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) దేశంలోనే 40లక్షలపైన జనాభా ఉన్న నగరాల్లో ‘బెస్ట్ సెల్ఫ్ సస్టెయినింగ్ సిటీ’గా (స్వీయ సుస్థిరత సాధించటంలో) నిలిచింది. సిరిసిల్ల, ఘట్కేసర్ అత్యంత పరిశుభ్రమైన పట్టణాలుగా నిలిచాయి. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి ఈ అవార్డులను అందించారు. రాష్ట్రం నుంచి పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఇతర పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డులకు దేశంలోని 4,300 నగరాలు, పట్టణాలు పోటీ పడ్డాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో రెండో బహుమతిని అందుకున్న కరీంనగర్ పట్టణానికి రూ.4 కోట్ల నగదును కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. ‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన కార్యక్రమాలు జాతీయస్థాయిలో అవార్డుల పంట పండించాయి. అవార్డులు అందుకున్న పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను మంత్రి కే తారకరామారావు అభినందించారు.
పరిశుభ్రతకు చిరునామా..
గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్యం, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త రవాణాకు వాహనాల కొనుగోలు, ఎఫ్ఎస్టీపీల నిర్మాణం, పట్టణ హరితహారం, మురుగు నీటి నిర్వహణ, తదితర అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో 101 పట్టణాలు, నగరాలు ఓడీఎఫ్ ప్లస్ క్యాటగిరీకి అర్హత సాధించాయి. ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ విభాగంలో గతంలో హైదరబాద్ మాత్రమే ఉండగా, తాజాగా వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి, వికారాబాద్, నిర్మల్ పట్టణాలు చేరాయి. బహిరంగ మలవిసర్జనను రూపుమాపేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే 12 పూర్తికాగా, 15 ప్లాంట్ల నిర్మాణం చివరిదశలో ఉన్నది. మరో 46 పట్టణాల్లో వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది. పట్టణాలు, నగరాల్లో చెత్త సేకరణకు 4,842 స్వచ్ఛ ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రతి వెయ్యిమందికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 9,088 మరుగుదొడ్లను నిర్మించారు. 1.57 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. ప్రతి పట్టణానికి నెలానెలా నిధులు విడుదల చేస్తున్నారు.