Civils prelims : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 (Civil Services Prelims Exam 2025) తోపాటు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమ్స్) (Indian Forest Service (Prelims)) పరీక్ష నోటిఫికేషన్లను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి (జనవరి 22) నుంచే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మే 25న జరగనుంది.
అయితే ఈసారి అన్ని సర్వీసులకు కేవలం 979 ఖాళీలను మాత్రమే యూపీఎస్సీ భర్తీ చేయనుంది. గత ఏడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోల్చితే ఇప్పుడు 77 పోస్టులు తక్కువగా ఉన్నాయి. అయితే సివిల్ సర్వీసెస్‌తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో కూడా 150 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.
కాగా గత కొన్నేండ్లుగా చూస్తే.. ఫిబ్రవరి నెలలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చేంది. ఈ ఏడాది మాత్రం జనవరి నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. ప్రస్తుతం గత ఏడాదికి సంబంధించిన UPSC CSE ఇంటర్వ్యూ సెషన్ జరుగుతోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌లో ముగుస్తుంది. ఆ వెంటనే మే 25న UPSC CSE 2025 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. CSE ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు UPSC మెయిన్స్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
గత గణాంకాలను పరిశీలిస్తే.. గడచిన కొన్ని సంవత్సరాలుగా UPSC CSE ఫలితాల్లో ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఆధిపత్యం కనబరుస్తున్నారు. యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీస్‌లో రిక్రూట్ అయిన వారిలో 70 శాతానికి పైగా టెక్నికల్ స్ట్రీమ్‌ల నుంచి వచ్చినవారే ఉండటం గమనార్హం. 2011-2020 మధ్య కాలంలో హ్యుమానిటీస్ స్ట్రీమ్ నుంచి సివిల్ సర్వీస్‌ను ఎంచుకునే అభ్యర్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు దాటిన అభ్యర్థులను డిస్క్రిప్టివ్ మెయిన్స్‌కు ఎంపికవుతారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు UPSC CSE పరీక్ష 6 సార్లు రాయవచ్చు. OBC, PwD అభ్యర్థులకు 9 పర్యాయాలు రాసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా పరీక్ష రాయవచ్చు.
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Dog revenge | ఢీకొట్టిన కారు యజమానిపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. Video viral