పీర్జాదిగూడ : వరంగల్ జాతీయ రహదారిలోని ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు జరుగుతున్న ఆరు లైన్ల కారిడార్ పనులను పూర్తిచేసి దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం పీర్జాదిగూడలో జరుగుతున్న కారిడార్ రోడ్డు పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కారడార్ పనులు ప్రారంభించి 8 సంవత్సరాలు అవుతోందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేశామని చెప్పారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కారిడార్ పనుల జాప్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
నగరంలోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే తర్వాత 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఆరు లైన్ల కారిడార్ ఉప్పల్-నారపల్లి కారిడారేనని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.