UPI Payments : దేశంలో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల (UPI Transactions) సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. ఇక లావాదేవీల విలువ 18 శాతం వృద్ధితో రూ.29.37 లక్షల కోట్లుగా నమోదైంది.
సెప్టెంబర్‌లో ప్రతిరోజూ సగటున 802 మిలియన్ల లావాదేవీలు జరుగగా వాటి విలువ సుమారు రూ.97,913 కోట్లుగా ఉంది. ఆగస్టు నెలలో నమోదైన 24.51 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే సెప్టెంబర్‌లో స్వల్ప తగ్గుదల కనిపించినా వార్షిక వృద్ధి మాత్రం బలంగా కొనసాగుతున్నది. ఇదే సమయంలో ఐఎంపీఎస్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ కూడా 18 శాతం పెరిగి రూ.7.06 లక్షల కోట్లకు చేరింది. ఇదిలావుంటే రూ.2,000 దాటిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4% ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ విధించాలన్న ప్రతిపాదనను వ్యాపారవర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చిన్న, మధ్యతరహా వ్యాపారులపై భారం మోపుతుందని, డిజిటల్ చెల్లింపుల స్వీకరణను దెబ్బతీస్తుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీనికి నిరసనగా అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ పాటించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) సహా పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చాందినీ చౌక్ ఎంపీ, సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ నేతృత్వంలోని సుమారు 20 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైంది.
ఈ భేటీ తర్వాత వ్యాపార సంఘాలు తమ నిరసన పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ కొత్త ఛార్జీల విధానం కేవలం రూ.2,000 మించిన మర్చంట్ (పీ2పీ) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీలలో 96 శాతానికిపైగా రూ.2,000 లోపే ఉంటున్నాయని, కాబట్టి అత్యధిక శాతం లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది. అంతేగాక నెలవారీగా రూ.1 లక్షవరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా ఈ ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టంచేసింది.