Upendra | ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించిన వదంతులు ఎక్కువగా వ్యాపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరినట్టు జోరుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందారు. ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని స్పర్శ్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడ చికిత్స అందించారని కొందరు చెప్పగా, మరికొందరు ఉపేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని వార్తలు వచ్చాయి. ‘యూఐ’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అవి ఇప్పుడు తీవ్రమయ్యాయని అనేక కథనాలు నెట్టింట హల్చల్ చేశాయి.
అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ఉపేంద్ర స్వయంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో స్పష్టతనిచ్చిన ఉపేంద్ర, ‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే నేను ఆసుపత్రికి వెళ్ళాను అంతే తప్ప.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దు. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు అంటూ ఉపేంద్ర తన ట్వీట్లో పేర్కొన్నారు. ఉపేంద్ర క్లారిటీతో గాలి వార్తలకి పులిస్టాప్ పడ్డట్టు అయింది. అయితే తమ అభిమాన నటుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసి అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయన సడెన్ గా ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపై పలు ఆలోచనలు చేస్తున్నారు.
నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఉపేంద్రకి 56 ఏళ్ళు కాగా, ఆయన యాసిడిటీ సమస్యతో వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. గతంలో యూఐ సినిమా షూటింగ్ సమయంలో కూడా యాసిడిటీ సమస్యతో బాధపడ్డారు. ఎక్కువ సేపు షూటింగ్, పని ఒత్తిడి, తినే అలవాట్లలో మార్పులు వలన ఎసిడిటీ వచ్చి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.