తాతతో కలిసి సరదాగా ప్రారంభించిన ఆటపై క్రమంగా మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధించే స్థితికి చేరాడు. సరదాగా చేతబట్టిన రాకెట్‌తో రికార్డులు తిరగరాయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు.ఆల్ఇండియా టోర్నీల్లో సత్తాచాటుతూ..అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆ కుర్రాడే..హైదరాబాద్‌కు చెందిన గంటా
సాయి కార్తీక్ రెడ్డి. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడమే తన లక్ష్యమంటున్న నయా టెన్నిస్ స్టార్ పై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడ విభాగం : ఏడేండ్ల ప్రాయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆడుకునేందుకు గ్రౌండ్‌కు వెళ్లిన కార్తీక్.. అక్కడ టెన్నిస్ రాకెట్ చూసి మక్కువ పెంచుకున్నాడు. ఇది గమనించిన తాతయ్య అతడి ఉత్సాహాన్ని సరైన దారిలో పెడితే ప్రయోజనం ఉంటుందని యోచించి ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ప్రారంభించగా.. కార్తీక్ చూస్తుండగానే ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. అండర్-10 సింగిల్స్‌లో తొలిసారి టైటిల్ దక్కడంతో.. ఆటపై మక్కువ పెంచుకున్న కార్తీక్ అక్కడి నుంచి టెన్నిస్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. 2014లో మొదటి సారి జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచిన కార్తీక్.. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ ఇలా ఏ స్థాయి టోర్నీలో బరిలోకి దిగినా.. గెలుపే లక్ష్యంగా తుదికంటా పోరాడుతూ విజయాలు సాధిస్తూ వచ్చాడు.
సింగిల్స్‌తో పాటే డబుల్స్..
కెరీర్ ఆరంభం నుంచే సింగిల్స్‌తో పాటు డబుల్స్‌పై దృష్టిపెట్టిన కార్తీక్ ఈ ఏడాది ట్యూనీషియాలో జరిగిన ఐటీఎఫ్ మెన్స్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు. మరో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన కార్తీక్.. వారం వ్యవధిలో హైదరాబాద్‌లో జరిగిన రెండు ఆలిండియా ర్యాంకింగ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాడు. గత వారం పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన అతడు.. తాజా పోటీల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ప్రతిభకు కొదవలేకపోవడంతో సరైన ప్రోత్సాహం లభిస్తే.. మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధమంటున్నాడు. టెన్నిస్ ఖర్చుతో కూడుకున్న క్రీడకావడంతో స్పాన్సర్స్ లభిస్తే.. దేశం తరఫున గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాలని భావిస్తున్నాడు. ఐటీఎఫ్ జూనియర్స్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 297వ స్థానానికి చేరిన కార్తీక్.. ఐటా బాలుర సింగిల్స్‌లో 11వ ర్యాంక్ దక్కించుకున్నాడు.
ఈ ఏడాది సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ కెప్టెన్‌గా టీమ్‌ను విజేతగా నిలిపా. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించాలనుకుంటున్నా. అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో స్పాన్సర్స్ ముందుకొస్తే మరిన్ని విజయాలు సాధిస్తా.