Crime news : ఇన్సూరెన్స్ కంపెనీ (Insurence company) నుంచి తప్పుడు పద్ధతిలో డబ్బులు కాజేసేందుకు భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. భర్త పేరు మీద ఉన్న రూ.25 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకునేందుకు ఆయన చనిపోయినట్లు నాటకమాడారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ (Death certificate) సంపాదించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అంతర్గత విచారణలో అది ఫేక్ డెత్ సర్టిఫికెట్ అని తేలింది. దాంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరానికి చెందిన శివశంకర్, కేశ్ కుమారి ఇద్దరూ భార్యాభర్తలు. 2012 డిసెంబర్లో శివశంకర్ తన పేరు మీద రూ.25 లక్షలకు జీవిత బీమా చేశాడు. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 21న కేశ్ కుమారి తన భర్త చనిపోయాడంటూ ఇన్సూరెన్స్ కంపెనీలో డెత్ సర్టిఫికెట్‌తోపాటు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించింది.
దాంతో కంపెనీ రూ.25 లక్షల ఇన్సూరెన్స్ నగదును కేశ్ కుమారి ఖాతాలో జమచేసింది. అయితే ఆ తర్వాత జరిగిన అంతర్గత విచారణలో కేశ్ కుమారి సమర్పించిన డెత్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. దాంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత రెండేళ్లుగా వారు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నిందితులిద్దరూ పోలీసులకు చిక్కారు.