HY Meti : కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) హెచ్‌వై మేటి (HY Meti) అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 79 ఏళ్లు. ఆయన గత కొన్నాళ్లుగా శ్వాసకోశ సంబంధ వ్యాధితోపాటు వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మేటి మరణవార్త తెలియగానే కర్ణాటక సీఎం సిద్ధరాయమయ్య ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మేటి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కలిసి బాగల్కోట్లో ఉంటున్నారు. గతంలో ఆయన బాగల్కోట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
ఆయన జనతాదళ్ పార్టీ తరఫున గులేడ్గుడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి బాగల్కోట్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. మేటి 1994లో కర్ణాటక అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2013లో సిద్ధరామయ్య క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.