మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు పెద్ద వాగు ఇసుక వివాదస్పద ( Sand Issue ) మవుతుంది. ఈ విషయంలో అధికారులు మొండికేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణపేట ( Narayanapet) – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ( Kodangal Lift ) నిర్మాణం పనులకు అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగునీరు, త్రాగునీరు ప్రశ్నార్థకమవుతుందని మాగనూరు గ్రామస్థులు కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు.
గ్రామ శివారులో ఉన్న పెద్ద వాగు నుంచి మక్తల్ మండలం కాచువార్ సమీపంలో కొనసాగుతున్న సిమెంటు పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతినిధి బృందం పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు గట్టిగా నిలువరిస్తున్నారు.
ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం నారాయణపేట ఆర్డీవో రామచందర్, మక్తల్ సీఐ రామ్ లాల్ రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు, స్థానికులతో చర్చలు నిర్వహించారు. తమ వాగు నుంచి పిడికెడు మట్టిని తరలించిన తాము ఊరుకోబోమని వచ్చిన టిప్పర్లను ఖాళీగా తిప్పి పంపించారు.
ఇసుక పైప్ లైన్ టెండర్ దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు మాత్రం అధికార బలంతో పెద్దవాగులో ప్రభుత్వ అనుమతులు లేకుండానే రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకుని ఇసుక రవాణాకు మార్గం సుగమం చేసుకున్నారు. తాజాగా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతుండగా విషయం తెలుసుకున్న గ్రామస్థులు, రైతులు వాగు వద్దకు చేరుకుని మరోసారి వాహనాలను అడ్డుకున్నారు.
స్థానిక తహసీల్దార్ నాగలక్ష్మి, డీటీ సురేష్, ఎస్సై అశోక్ బాబు వాగు వద్దకు చేరుకుని ఇసుక రవాణాకు అడ్డు తగిలితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులు, పోలీసులు దగ్గరుండి ఇసుక టిప్పర్లను బయటికి తరలించారు. ఒక దశలో రైతులు, రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అధికారులు, రైతులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి సముదాయించేందుకు ప్రయత్నించారు.