ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా సత్తా చాటుతున్న స్త్రీలను ఆర్థిక ఇబ్బందులు మాత్రం వీడటం లేదు.మహిళా అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాన్నివ్వలేకపోతున్నాయి. పథకాలు నిష్ప్రయోజనంగా మారుతున్నాయి.ఈ ఏడాదికిగాను టైడ్ పేరిట బీడబ్ల్యూఏఐ విడుదల చేసిన ఓ నివేదిక.. దేశంలో మహిళా ఆంత్రప్రెన్యూర్స్ కష్టాలను ఏకరవుపెట్టింది. ప్రస్తుత విధానాల్లో మార్పుల ప్రాధాన్యతను చాటింది.
Antrapreneurs | న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మహిళా సాధికారతే మా లక్ష్యం అంటూ గద్దెనెక్కిన పాలకులు.. అధికారంలోకి రాగానే ఆ విషయాన్నే మర్చిపోతున్నారు. దేశంలో మహిళా ఆంత్రప్రెన్యూర్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లే ఇందుకు సజీవ సాక్ష్యం. ఏ బ్యాంకుకు వెళ్లినా.. మరే ఆర్థిక సంస్థను సంప్రదించినా చిన్నచూపే. ప్రభుత్వ పథకాలు సైతం ఎందుకూ పనికిరాకుండాపోతుండటం గమనార్హం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, ఇతర పట్టణాల్లో చిన్నచిన్న వ్యాపారాలు, సంస్థలను నిర్వహిస్తున్న మహిళలకు ఆసరానే కరువైందని ఈ ఏడాదికిగాను వ్యాపార నిర్వహణ వేదిక టైడ్ ద్వారా భారత్ వుమెన్ అస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) సోమవారం విడుదల చేసిన నివేదిక చెప్తున్నది.
అడుగడుగునా సవాళ్లే
తాజా సర్వే ప్రకారం దేశంలోని మహిళా ఆంత్రప్రెన్యూర్స్లో ప్రతీ ముగ్గురిలో ఒకరికి అప్పు పుట్టట్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పథకాల ప్రయోజనాలూ అందడం లేదు. దీంతో తమ ఆలోచనలు, వ్యాపార-పారిశ్రామికాభివృద్ధికి అవసరమయ్యే ప్రత్యేక రుణ సదుపాయాలను ఏర్పాటు చేయాలని మహిళలంతా కోరుతున్నారు. సాంకేతికంగా, నైపుణ్యాలపరంగా తమకు మద్దతిస్తే అద్భుత ఫలితాలను సాధిస్తామన్న ధీమాను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గదర్శకత్వం, సహకారం ఉంటే మహిళలు వారి లక్ష్యాలను వేగంగా చేరుకుంటారన్న అభిప్రాయాలు సర్వేలో వ్యక్తమవుతున్నాయి. నారీశక్తి తదితర పథకాల లక్ష్యం కూడా నెరవేరుతుందని అంటున్నారు.
మార్పు అవసరం
మహిళలపట్ల బ్యాంకర్లు, ఇతర రుణదాతల్లో నెలకొన్న అపనమ్మకం పోవాల్సిన అవసరం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది. పురుషులకు సులువుగా మంజూరవుతున్న రుణాల్లో.. స్త్రీల విషయానికొచ్చేసరికి అనేక ఆంక్షలుంటున్నాయని ఈ రిపోర్టు చెప్తున్నది. కాబట్టి ఈ పక్షపాత ధోరణి పోవాలని, ఇప్పుడున్న విధానాల్లో సవరణలు చేయాలని, మహిళలకు అన్నివిధాలా ప్రోత్సహించే పాలసీలు తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూచీకత్తులేని సూక్ష్మ రుణాలిచ్చి ఆర్థికంగా, నైపుణ్యాలను పెంచి సమర్థవంతంగా మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌ను తయారు చేయాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కాగా, తమ రెండో ఎడిషన్ కోసం దేశవ్యాప్తంగా నాన్-మెట్రో నగరాల్లో 18-55 ఏండ్ల మధ్య వయసున్న 1,300 మందికిపైగా మహిళా ఆంత్రప్రెన్యూర్స్ అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను బీడబ్ల్యూఏఐ సిద్ధం చేసింది.
ఉద్యోగాలు కావాలి ; కొలువుల కోసం మహిళలు, ఫ్రెషర్స్ నుంచి డిమాండ్
దేశంలో ఉద్యోగాల కోసం మహిళలు, ఫ్రెషర్స్ నుంచి భారీగా డిమాండ్ కనిపిస్తున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వీరి నుంచే ఎక్కువగా ఉద్యోగ దరఖాస్తులున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక ‘అప్నా’ సోమవారం తెలిపింది. అప్నా తాజా నివేదిక ‘ఇండియా ఎట్ వర్క్-క్యూ1 2025’లో ఈ జనవరి-మార్చిలో కొలువుల కోసం ఏకంగా 1.81 కోట్ల అప్లికేషన్లు పెట్టుకున్నారని తేలింది. ఇది.. నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే 30 శాతం ఎక్కువన్నది. ముఖ్యంగా మహిళల నుంచి 62 లక్షలకుపైగా ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని, గతంతో చూస్తే 23 శాతం అధికమని పేర్కొన్నది. అలాగే ఫ్రెషర్స్ నుంచి 66 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయని, 46 శాతం పెరిగాయని వివరించింది.
టెక్ హైరింగ్‌లో వరంగల్..
ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఇంటిలిజెన్స్, డాటా సెంటర్స్ రంగాల్లో పనిచేసేందుకు స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు గిరాకీ ఉందని తాజా రిపోర్టులో తేలింది. ఈ క్రమంలోనే ఇండోర్, జైపూర్, లక్నో, రాజ్‌కోట్, వరంగల్ నగరాల్లో టెక్ హైరింగ్ బాగా జరుగుతున్నదని పేర్కొన్నది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై నగరాలు ఈ విషయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నా.. వరంగల్ వంటి నగరాలు వాటికి కొత్త ప్రత్యామ్నాయాలుగా ఎదగడం గమనార్హం.
కేసీఆర్ దూరదృష్టితో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టితో అభివృద్ధిని వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరింపజేయడం కలిసొచ్చింది. దీంతో స్వరాష్ట్రంలో అభివృద్ధి అంతటా వ్యాపించింది. ఐటీ, తయారీ, ఆటో తదితర కంపెనీలు ఇతర నగరాల్లోనూ ఏర్పాటయ్యాయి. ప్రధానంగా రాష్ట్ర రెండో ఐటీ హబ్‌గా వరంగల్ అవతరించింది. అక్కడ టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగావకాశాలూ పెరుగుతున్నాయి.
తాజా నివేదికే నిదర్శనం.
దేశంలోని మహిళా ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో ఎక్కువమంది సూక్ష్మ, చిన్న సంస్థలనే నడిపిస్తున్నారు. వారి ఆలోచనల్ని విస్తృతపర్చుకోవాలని భావిస్తున్నా సరైన సహకారం లభించడం లేదు. ఫైనాన్స్, డిజిటలైజేషన్లో మద్దతు కొరవడింది. ఇప్పటికీ పురుషుల జోక్యం లేనిదే మహిళల అభివృద్ధికి ఆస్కారం లేకుండాపోతున్నది.
-గుర్జోధ్పాల్ సింగ్, టైడ్ ఇండియా సీఈవో