హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) విషయంలో మంత్రి కే తారకరామారావు విజన్ అద్భుతమంటూ అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (డల్లాస్) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఎర్లీ కోడర్స్ (టీఈసీ) కార్యక్రమంలో భాగంగా మారుమూల జిల్లాల్లోని విద్యార్థులకు కోడింగ్ పాఠాలు నేర్పడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య హద్దులు చేరిపివేశారని కొనియాడింది. టీఈసీలో తమను భాగస్వాములను చేసినందుకు, 2020ని ఏఐ సంవత్సరంగా (ఇయర్ ఆఫ్ ఏఐ) ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను అభినందిస్తూ వర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జేయ్ వీరసామి లేఖ రాశారు.
‘2020ని ఏఐ సంవత్సరంగా ప్రకటించడం ద్వారా క్లిష్టమైన సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే పరిష్కారం కనుగొనగలమన్న మీ విజన్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఏఐ సంవత్సరాన్ని ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని వీరసామి పేర్కొన్నారు. ఏఐని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో తెలంగాణ ఎర్లీ కోడర్స్ (టీఈసీ) పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి తమను, టీఎస్టీఎస్ను భాగస్వాములను చేసినందుకు గర్వంగా ఉన్నదని లేఖలో తెలిపారు. నారాయణపేట జిల్లాలోని 2013 మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, తమ వర్సిటీ నుంచి పరీక్షించి 98.7 శాతం మందికి సర్టిఫికెట్లు జారీ చేశామని చెప్పారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు గొప్ప అవకాశాలు ఎందుకు అందుకోలేరు? అన్న ప్రశ్నకు ఈ కార్యక్రమంతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారని కొనియాడారు. ఈ గొప్ప కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసినందుకు మంత్రి కేటీఆర్‌తోపాటు ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్రావు, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తల, ఇతర అధికారులు, టీచర్లు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.