హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని, అందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. భవననిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల ప్రోత్సాహానికి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కమిటీ నివేదికను వీలైనంత తొందరగా ముఖ్యమంత్రికి అందజేస్తామని, ఆయన మార్గదర్శకాల మేరకు తుది నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు.
శనివారం నిర్వహించిన నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ (న్యాక్) 42వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటుచేసిన స్నైడర్ ల్యాబ్, ఎల్అండ్టీ హైడ్రాలిక్ మెకానిక్ ల్యాబ్‌లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి, ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీతో కలిసి ప్రారంభించి, అకాడమీలోని పలు బ్లాక్‌లను సందర్శించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వసతి, సౌకర్యాలపై ఆరా తీశారు. వారి అనుభవాలను తెలుసుకొన్నారు.
బోర్డు సమావేశంలో ఏడాది కాలంలో కొనసాగిన కార్యక్రమాలపై సమీక్షించి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. నైపుణ్య, నైపుణ్యేతర కార్మికులకు శిక్షణ ఇవ్వటంలో న్యాక్ కృషిని, సిబ్బందిని మంత్రి వేముల ప్రత్యేకంగా అభినందించారు. గతేడాది 16వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొని, 15వేల మందికి(95 శాతం) శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొన్నామని, ఈ ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం 3 నెలల ఫినిషింగ్ ప్రోగ్రామ్, ఏడాది కాలవ్యవధితో పీజీ కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకొంటున్నామని వివరించారు.
ప్రభుత్వ విధానాలతో రియల్ బూమ్
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని మంత్రి వేముల తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన టైమ్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ఎక్స్పో 2021కు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాంతిభద్రతలు, మిగులు విద్యుత్తుపై దృష్టి సారించటంతో రాష్ర్టానికి అనేక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.