– నల్లగొండలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధుల సమావేశం
– హాజరైన బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగు రాఘవరావు
రామగిరి, సెప్టెంబర్ 28 : బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ అండ్ సర్వీస్ (బాస్) పని చేస్తుందని, ప్రభుత్వం బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలను అందజేయాలని బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగు రాఘవరావు అన్నారు. నల్లగొండలోని పానగల్లులో గల శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానంలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆ సంఘం ముఖ్య ప్రతినిధుల సమావేశానికి రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి కోసం బాస్ పని చేస్తోందని తెలిపారు. శాఖాపరమైన భేదాలు లేకుండా ఏ బ్రాహ్మణ కుటుంబానికి ఆపద వచ్చినా స్థానికంగా ఉన్న సంఘాల సహకారంతో బాస్ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల నాగార్జునసాగర్‌లో వినాయక విగ్రహం వద్ద జరిగిన ఘటనలో ఓ బ్రాహ్మణుడు అకాల మృత్యువాత పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మృతుడి కుటుంబానికి బాస్ తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అంతకుముందు శ్రీ పచ్చల సోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు చేశారు.
అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు మాట్లాడుతూ.. బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ అండ్ సర్వీస్ అధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ఆశయాలు, లక్ష్యాలు తమకు నచ్చాయని తెలిపారు. బాస్ నిర్వహించే కార్యక్రమాలకు తమ సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సంస్థ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నవీన్ శర్మ, పులియాల యాదిగిరిరావు, సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ, గుండ్లపల్లి వెంకటేశ్వరరావు, దివాకర్ శర్మ, వినోద్ కుమార్, బాస్ ప్రతినిధులు భూపతి లక్ష్మీ, నవీన్ కుమార్, వేముల రవికుమార్, జనగాం ఉమాశంకర్ రావు పాల్గొన్నారు.

‘బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధే ‘బాస్’ లక్ష్యం’