కోడేరు, డిసెంబర్ 26 : కేంద్ర మంత్రులకు సేద్యం గురించి అసలే తెలియదని, అందుకే అన్నదాతల బాధలు వారికి అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం పండిన పంటల కొనుగోళ్లకు మోకాలడ్డుతున్నదని మండిపడ్డారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరులో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి చికిత్సా శిబిరాన్ని ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరి సాగులో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు. వానకాలంలో 63.13 లక్షల ఎకరాల్లో వరి సాగైందని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరిస్తే అంత ఎలా సాగైందని ఎదురు ప్రశ్నించారని చెప్పారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరిక మేరకు కొల్లాపూర్‌కు మామిడి మార్కెట్ కేంద్రాన్ని మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ యాసంగికి 1.47 కోట్ల ఎకరాలకుగానూ రూ.7,650 కోట్లను రైతుబంధు కింద కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. 63 లక్షల మంది రైతుల అకౌంట్లలో రెండు, మూడ్రోజుల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు.