దేశ యువత పోరాటానికి దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా ( Minister Resign ) చేశారని బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు,ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ( Anil Kurmachalam ) అన్నారు. మంత్రి రాజీనామా ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం, నైతిక బాధ్యత, ప్రజల అభిప్రాయానికి ఇచ్చే గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇది వ్యక్తులపై విజయం కాదని. ప్రజాస్వామ్య విలువలపై ప్రజల విశ్వాసానికి లభించిన గౌరవంగా చూడాలని వెల్లడించారు.
దేశ భవిష్యత్తును నిర్మించేది యువశక్తేనని వివరించారు. అన్యాయం, అవినీతి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలపై యువత రాజ్యాంగబద్ధంగా స్పందించడం ఆరోగ్యకరమైన సంకేతమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, రాజ్యాంగ బద్ధంగా పోరాడే సంకల్పం ఉంటే ఎంతటి ప్రభుత్వాన్నైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించేలా చేయవచ్చని నేటి యువత దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు.
ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యలు, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. దేశ నిర్మాణంలో యువత మరింత చురుకైన పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.