రాయ్పూర్ : నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ నివాళులర్పించారు. జవాన్ల పార్థివదేహాల వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జగదల్పూర్లో 14 మంది అమర జవాన్ల మృతదేహాలను ఉంచారు. అయితే నక్సల్స్ దాడిలో మొత్తం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు 14 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.
జవాన్లపై దాడి జరిగిన ప్రాంతాన్ని మరికాసేపట్లో అమిత్ షా పరిశీలించనున్నారు. బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దును పరిశీలించి, సమీక్ష చేయనున్నారు. చికిత్స పొందుతున్న జవాన్లను అమిత్ షా పరామర్శించనున్నారు.
మావోయిస్టుల మెరుపుదాడిలో మరణించిన మొత్తం జవాన్ల సంఖ్య 24కు పెరిగింది. 31 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏపీకి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్ ఉన్నారు. వీరు కోబ్రా 210 దళంలో పనిచేస్తున్నారు. బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో డీఆర్జీ, స్పెషల్ టాస్క్ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాల కోసం హిడ్మా నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) సిల్గేరీ అటవీ ప్రాంతంలో గుట్టలపై మాటు వేసింది. శనివారం మధ్యాహ్నం బలగాలు అక్కడికి రాగానే మెరుపు దాడి చేసింది. అనంతరం మావోయిస్టులు పోలీసుల దగ్గర నుంచి 20కి పైగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్టులే తప్పుడు సమాచారం ఇచ్చి భద్రతా దళాలు అడవిలోకి వచ్చేలా పథకం పన్ని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలను సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ కొట్టిపారేశారు. ఘటనలో ఇంటలిజెన్స్ వైఫల్యం లేదన్నారు. నక్సలైట్లలో కూడా 10-12 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
జవాన్లపై దాడిలో మావోయిస్టులు మెషీన్ గన్లను, బాంబులను ప్రయోగించారు. దీంతో జవాన్లు అప్రమత్తమయ్యేలోపే భారీ ప్రాణనష్టం జరిగింది. మావోయిస్టుల్లో ఓ మహిళ తప్ప మిగతా మరణాలకు సంబంధించిన సమాచారం అధికారికంగా తెలియరాలేదు. కాల్పుల ఘటనతో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో హైఅలెర్ట్ ప్రకటించాయి. తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Chhattisgarh: Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel who lost their lives in the Naxal attack, in Jagdalpur. https://t.co/vlDGKokhVe pic.twitter.com/MQjHOY0RIq
— ANI (@ANI) April 5, 2021