e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News నల్ల చట్టాలకు చెల్లు

నల్ల చట్టాలకు చెల్లు

  • వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం
  • పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజునే బిల్లు!
  • ఎంఎస్‌పీపై ఎటూ తేల్చని కేంద్ర మంత్రి మండలి
  • మిగతా డిమాండ్లను తేల్చాల్సిందేనంటున్న రైతులు
  • నేడు హైదరాబాద్‌లో కిసాన్‌ మహా పంచాయత్‌
  • హాజరుకానున్న బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌
  • ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకుతున్న ఉద్యమం

వ్యవసాయానికి గొడ్డలిపెట్టులా కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు ఎట్టకేలకు కాలం చెల్లింది. దేశ రాజధాని శివార్లలో రోడ్లపై రేయింబవళ్లు రైతులు పడ్డ కష్టాలకు ఫలితం లభించింది. వ్యవసాయ చట్టాలపై తీవ్రస్థాయిలో చేస్తున్న ఆందోళనలకు ఏడాది పూర్తి కావడానికి రెండు రోజుల ముందు కేంద్ర మంత్రి మండలి.. మూడు చట్టాలను వెనక్కు తీసుకొనే బిల్లుకు ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ):మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ గత వారం ప్రకటించిన తరువాత కూడా ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు కరాఖండిగా చెప్పడంతో మోదీ సర్కారు వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియను ప్రారంభించక తప్పలేదు. దేశమంతా రైతుల పక్షాన నిలిచినా.. రాజకీయ పక్షాలన్నీ మద్దతు తెలిపినా.. మొండితనంతో ఏడాదిపాటు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పినప్పటికీ రైతులు ఎంతమాత్రం విశ్వసించలేదు.

- Advertisement -

సాగు చట్టాల రద్దుతోపాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై స్పష్టమైన హామీ లభించేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడించడంతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహణకు పూనుకొన్నది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో మహా పంచాయత్‌ జరుగనున్నది. ఈ క్రమంలో తప్పనిసరై రైతు చట్టాల రద్దు నిర్ణయానికి బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలుపడంపై రైతులు కొంతవరకు ఊరట చెందారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021’ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ క్యాబినెట్‌ సమావేశం అనంతరం తెలిపారు.

కేంద్రం ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య (ప్రోత్సాహకర, సులభతర) చట్టం, రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం.. రద్దుకు నిర్ణయం తీసుకొన్నామని వెల్లడించారు. ‘వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడమే మా ప్రాధాన్యం. దీనికి సంబంధించిన విధివిధానాలను అన్నింటినీ పూర్తిచేశాం’ అని తెలిపారు. అయితే, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీ ఏర్పాటు, రైతులు ఎదుర్కొంటున్న ఇతరత్రా సమస్యలపై క్యాబినెట్‌లో చర్చించారా? లేదా? అనే విషయాల్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగుచట్టాలను గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించింది.

అయితే, వీటిని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది అన్నదాతలు ఏడాదిగా నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం నిర్ణయంపై రైతు సంఘాల నేతలు స్వాగతిస్తూనే.. తమ మిగతా డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘ప్రధాని మోదీ ప్రకటన తరువాత కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలుపడం అన్నది లాంఛనమే. కేంద్ర ప్రభుత్వం మా మిగతా డిమాండ్లపై దృష్టిపెట్టాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తేవాలి’ అని రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ నేత శివకుమార్‌ అన్నారు.

రైతులకు సాయంలో సీఎం కేసీఆర్‌ భేష్‌ అఖిల భారత కిసాన్‌ సభ ప్రశంసలు

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (నమస్తే తెలంగాణ): సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా సాగుతున్న రైతు ఉద్యమంలో అమరులైన దాదాపు 750 మంది రైతుల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంపై అఖిల భారత కిసాన్‌ సభ హర్షం వ్యక్తంచేసింది. సీఎం నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నది. రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండ కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపింది. సీఎం కేసీఆర్‌ మాదిరిగానే అన్ని రాష్ర్టాల సీఎంలు రైతుల కుటుంబాలను ఆదుకొనేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చింది.

హైదరాబాద్‌లో నేడు మహా పంచాయత్‌

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిన ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఇప్పుడు దక్షిణాదికి పాకింది. ఇందుకు తెలంగాణ రాష్ట్రమే తొలి వేదికైంది. వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద గురువారం రైతులతో ‘మహా పంచాయత్‌’ (మహాధర్నా) నిర్వహించనున్నది. ఈ ధర్నాకు ఉత్తరాదిలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌తోపాటు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) కీలక నేతలు కూడా హాజరుకానున్నారు.

ఈ మేరకు ఏఐకేఎస్‌ బుధవారం ప్రకటన విడుదలచేసింది. మహా పంచాయత్‌ ధర్నాలు హైదరాబాద్‌తోపాటు దక్షిణాదిన అన్ని రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో నిర్వహించాలని ఏఐకేఎస్‌ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. మహాపంచాయత్‌ తొలి వేదికగా హైదరాబాద్‌ను ఎంపికచేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌కేఎం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనుండటం ప్రాధాన్యం సంతరించుకొన్నది.

మద్దతు ధర కోసం 90 కోట్ల మంది పోరాటం

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను చట్టబద్ధం చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ అఖిల భారత కిసాన్‌ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రత్యేక పత్రాన్ని విడుదల చేశాయి. వివిధ రాష్ట్రాల్లో కేంద్రం అందిస్తున్న మద్దతు ధర వివరాలను ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా బయటపెట్టారు. కొత్త సాగు చట్టాలను పూర్తిగా రద్దుచేసిన తర్వాత రైతులకు మేలు చేసేలా వారిని సంప్రదించి చట్టాలు చేయాలని బుధవారం డిమాండ్‌చేశారు. ఎంఎస్పీకి కచ్చితంగా చట్టబద్ధత కల్పించాలని కోరారు.

ఎంఎస్పీతోనే రైతులు కొంతవరకైనా సమస్యల నుంచి బయటపడగలుగుతారని తెలిపారు. దేశంలో 90 కోట్ల మంది రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. మద్దతు ధర అందకపోవటంతో దేశంలో రోజుకు సరాసరి 52 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా లక్ష మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని హన్నన్‌ మొల్లా ఆరోపించారు.

అప్పుడు డిమాండ్‌చేసిన మోదీ.. ఇప్పుడెందుకు చట్టం చేయరు?

స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయడంతోపాటు అన్ని పంటలకు ఎంఎస్పీ ఇస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2011లో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉండగా, ఆయన నేతృత్వంలోనే ముఖ్యమంత్రుల కమిటీ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని నాటి ప్రధానికి రాసిందని తెలిపారు. ఇప్పుడు మోదీయే ప్రధానిగా ఉన్నారని, మరి ఎందుకు చట్టం చేయటంలేదని మొల్లా ప్రశ్నించారు.

23 పంటలకు మద్దతు ధర ఇస్తున్నట్టు చెప్తున్నారని, కానీ అది కంటితుడుపు చర్యగానే ఉన్నదని విమర్శించారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. దేశంలో 15 శాతంమంది రైతులు మాత్రమే మద్దతు ధర పొందుతున్నారని, 85 శాతం మందికి నామమాత్రపు ధర కూడా దకడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఉద్యమంపై అనేక ఆరోపణలు చేశారని, ప్రధాని మోదీ రాజ్యాంగ సాంప్రదాయాలన్నింటికీ తిలోదకాలిచ్చారని విమర్శించారు.

ఉద్యమాన్ని తీవ్రం చేసే పనిలో టికాయిత్‌

సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలమంది రైతులను ఉద్యమానికి కదిలించి ఏడాదికాలంగా అదే ఉధృతిని కొనసాగించటంవెనుక ఉన్న శక్తి రాకేశ్‌ టికాయిత్‌. పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆయన చలించలేదు. ఒకనొక సమయంలో కేంద్రప్రభుత్వ దమనకాండతో వేలమంది రైతుల గాయాలపాలయ్యారు. అనారోగ్యంతో రోజూ పదులసంఖ్యలో ఉద్యమంలో రైతులు చనిపోయారు. ఈ పరిణామాలకు చలించిన ఆయన కన్నీరుపెట్టుకోవటం దేశంలోని ప్రతి రైతునూ కదిలించింది.

గంటల వ్యవధిలోనే ఢిల్లీ సరిహద్దుల్లో వేలమంది రైతులు మళ్లీ సంఘటితమై ప్రభుత్వ నిర్బంధానికి భయపడేదిలేదని ప్రకటించారు. అలా ఏడాదికాలంగా ఉద్యమంచేస్తూ చివరకు ప్రధాని మోదీయే స్వయంగా చట్టాలను రద్దుచేస్తున్నామని ప్రకటించేలా చేశారు. ఇప్పుడు రైతుల మరో ప్రధాన డిమాండ్‌ అయిన ఎంఎస్పీ చట్టంకోసం దక్షిణాది నుంచి ఉద్యమం మొదలుపెట్టే పనిలో టికాయిత్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement