హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేండ్ల తర్వాత విడుదల చేసిన తొలి పోలీసు నోటిఫికేషన్‌తో పోలీసు కొలువుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగుల మధ్య తీవ్రమైన పోటీ పెట్టింది. దాదాపు 12 లక్షల మంది వరకు నిరుద్యోగులు నాలుగేండ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, సుమారు 20వేల పోలీసు కొలువులతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేస్తూ.. కేవలం 7,437 పోస్టులను మాత్రమే భిక్షగా వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ భావోద్వేగాలను, ఏండ్లుగా పడుతున్న తమ శ్రమను ప్రభుత్వం అపహాస్యం చేసిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన అతి తక్కువ పోస్టుల్లో మహిళా రిజర్వేషన్ తీసేస్తే.. పురుషులకు మిగిలేవి చాలా తక్కువేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఖాళీలను భారీగా భర్తీ చేస్తారని ఎంతో ఆశపడ్డ తమతో ప్రభుత్వం ఆటాడుకుంటున్నదని మండిపడుతున్నారు..
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల కోసం లక్షల మంది నిరుద్యోగులు పోటీపడనున్నట్టు తెలుస్తున్నది. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 2022 తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ లేకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ తీసేస్తే.. పురుషులకు మిగిలేది 2,477 పోస్టులు మాత్రమే. అటు మహిళా అభ్యర్థులకు సైతం తీవ్రంగానే అన్యాయం జరిగిందని అంటున్నారు. రిజర్వేషన్ ద్వారా వారికి కేవలం 1,220 పోస్టులు మాత్రమే వస్తాయని వాపోతున్నారు.
ఇక 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో 347 మహిళలకు తీసేస్తే.. పురుషులకు మిగిలేవి 705 పోస్టులు మాత్రమే. అగ్నిమాపకశాఖలోనూ ఫైర్‌ఫైటర్ పోస్టుల్లో ఒక్క హైదరాబాద్ మినహా అన్నీ.. రెండు అంకెల పోస్టులే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 751 ఫైర్‌ఫైటర్ పోస్టుల్లో ప్రధానంగా హైదరాబాద్ (164), రంగారెడ్డి (82), మేడ్చల్-మలాజిగిరి (40), నిజామాబాద్ (34), యాదాద్రి-భువనగిరి (32), భద్రాద్రి-కొత్తగూడెం (25), ములుగు (25), నాగర్‌కర్నూల్ (23), సంగారెడ్డి (22), సిద్దిపేట (22)కు పోస్టులు కేటాయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తొలి పోలీసు నోటిఫికేషన్లోనే అతి తక్కువగా కానిస్టేబుల్, ఎస్సై నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో సివిల్, ఏఆర్ ఎస్సై, అగ్నిమాపకశాఖ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల పోస్టులను ఆయా జిల్లాలకు కేటాయిస్తే ఒక్కో జిల్లాకు సింగిల్ డిజిట్ మాత్రమే వస్తున్నది. సివిల్ ఎస్సై పోస్టుల్లో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, ప్రస్తుత జోగుళాంబ గద్వాల జోన్లో కేవలం నాలుగు పోస్టులు మాత్రమే కేటాయించింది. ఏఆర్ ఎస్సై పోస్టులైతే గుండు సున్నా. జోగుళాంబ జోన్లో మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలకు కేటాయించింది కేవలం 4 సివిల్ ఎస్సైలు మాత్రమే.
ఇక చార్మినార్ జోన్లో మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉండగా కేవలం 13 సివిల్ ఎస్సై పోస్టులు మాత్రమే కేటాయించారు. ఇక ఏఆర్ ఎస్సై పోస్టులు కూడా గుండు సున్నా. ఏఆర్ ఎస్సై పోస్టులకు రాజన్న జోన్, యాదాద్రి జోన్లలో కూడా గుండు సున్నా. బాసర జోన్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఏఆర్ ఎస్సై పోస్టులు కేవలం 2 మాత్రమే. భద్రాద్రి, యాదాద్రి జోన్లలో కేవలం 6 చొప్పున మాత్రమే కేటాయించారు.
ప్రభుత్వం పునరాలోచన చేసి నిరుద్యోగులకు 20 వేల పోలీసు ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోసం 19,000 పోస్టులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే.. కేవలం 7,437 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలపడం దారుణమని మండిపడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాదిమంది నిరుద్యోగులు, వారి కుటంబాలు తీవ్రంగా నష్టపోతాయని విమర్శిస్తున్నారు. తమ తల్లిదండ్రుల కష్టం చూసైనా ప్రభుత్వం 20 వేల పోస్టులతో నోటిషికేషన్ సవరించాలని కోరుతున్నారు.
నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయసు దాటిపోయిన అభ్యర్థులకు వయోపరిమితిని సడలించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు 35 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిషరించని పక్షంలో.. ఆగస్టు 5న నిర్వహించే శాంతియుత ర్యాలీ తర్వాత.. మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్లో కొన్ని కమిషనరేట్లలో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు మంగళం పాడింది. కేటాయించిన 1,380 తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టులను ఏయే కమిషనరేట్లకు ఎంతెంత కేటాయిస్తారో తెలియదు. కానీ.. తాజా నోటిఫికేషన్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ల పరిధిలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల కోసం సిద్ధపడుతున్న నిరుద్యోగులను నిరాశకు గురిచేసింది.
ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో కేవలం రెండు అంకెల పోస్టుల జిల్లాలు 12 ఉన్నాయి. అలాగే ఏఆర్ పోస్టుల్లో రెండు అంకెల పోస్టులు కేటాయించిన జిల్లాలు 21 ఉన్నాయి. ఏఆర్ పీసీ పోస్టుల్లో మహబూబాబాద్ 4, నల్లగొండ 8, జోగుళాంబ గద్వాల 9 పోస్టులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఇక 20లోపు పోస్టులు కేటాయించిన జిల్లాల్లో సూర్యాపేట (15), నాగర్‌కర్నూల్ (15), నారాయణపేట (17), వనపర్తి (10) ఉన్నాయి. ఆయా జిల్లాల్లో పోటీ పడే వేలాదిమంది పరిస్థితి ఏందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్) పోస్టులు జిల్లాలు/కమిషనరేట్ల వారీగా




01