
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 4: తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులపై రాష్ట్ర బీజేపీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, వారికి జాతీ య స్థాయి నాయకులు సైతం వంత పాడుతున్నారని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ మే దేశంలో నిరుద్యోగితను పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక దీనిని బహిర్గతం చేసిందని చెప్పారు. ఉస్మానియా వర్సిటీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుంగ బాలు మాట్లాడుతూ, దేశంలో సగటు నిరుద్యోగ రేటు 7.91 శాతం ఉండగా, తెలంగాణలో 2.2 శాతం మా త్రమే ఉందని చెప్పారు.
దేశ వ్యాప్తంగా గ్రామాల్లో సగటున 7.2 శాతం నిరుద్యోగిత ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఇచ్చిన తోడ్పాటుతో పలు గ్రామాల్లో నిరుద్యోగిత కేవలం 0.4 శాతంగా నమోదైందన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తని బీజేపీ నాయకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని స్ప ష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ఏడేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయాలకు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులు బలి కావొద్దని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ రూపొందించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన అరవింద్‌పై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్వీ నాయకులు జంగం అవినాశ్, కోతి విజయ్, శిగ వెంకట్, నవీన్ గౌడ్, మంతెన మధు, ఆవాల హరిబాబు, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.