Antonio Guterres | ఐక్యరాజ్యసమితి: మే 5: ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం పట్ల ఐక్య రాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలని, యుద్ధానికి దూరంగా ఉండాలని ఆయన భారత్, పాక్కు పిలుపునిచ్చారు. తప్పు చేయవద్దని, సైనిక పరిష్కారం పరిష్కారమే కాదని సోమవారం ఓ ప్రకటనలో ఆయన హితవు చెప్పారు. ఉగ్ర దాడి తర్వాత ఏర్పడిన చేదు భావాలను తాను అర్థం చేసుకోగలనని ఆయన తెలిపారు.
ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, ఇందుకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షపడేలా చూడాలని స్పష్టం చేశారు. శాంతి కోసం తన కార్యాలయం తలుపులు ఎప్పడూ తెరిచే ఉంటాయని ఇరుదేశాల ప్రభుత్వాలకు తెలియచేశారు. ఉద్రిక్తతలు తగ్గించి, దౌత్యపరమైన సంబంధాల మెరుగుదలకు, శాంతి స్థాపనను ప్రోత్సహించే ఎటువంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.