మాస్కో, నవంబర్ 10: రష్యా రాజధాని మాస్కోపై ఆదివారం ఉదయం ఉక్రెయిన్ 34 డ్రోన్లతో విరుచుకు పడింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే. అయితే ఆ డ్రోన్లు అన్నింటినీ కూల్చేసినట్టు మాస్కో మేయర్ సెర్గీ సొబ్యనిన్ తెలిపారు. సోచిలో సుమారు 50 ఆఫ్రికన్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, అధికారుల సదస్సు జరుగుతున్న వేళ ఈ దాడి జరిగింది. డ్రోన్ల దాడి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలుపగా.. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నట్టు సామాజిక మాధ్యమ నివేదికలు వెల్లడించాయి. డ్రోన్ల దాడి నేపథ్యంలో మాస్కోలోని రెండు విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు.