మాస్కో: రష్యాలోని జపొరిజియా అణు విద్యుత్తు కేంద్రం(Zaporizhzhia Nuclear Plant)లో భారీగా మంటలు వస్తున్నాయి. ఆ ప్లాంట్ నుంచి నల్లటి పొగ తీవ్ర స్థాయిలో వస్తోంది. డ్రోన్ల దాడి వల్లే ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జపొరిజియా ప్లాంట్ ప్రమాదం జరగడానికి నువ్వంటే నువ్వే కారణమని ఉక్రెయిన్, రష్యా దేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. రెండేళ్ల నుంచి ఆ ప్లాంట్ వద్ద రష్యా దళాలు పాగా వేశాయి. అణు కేంద్రం నుంచి నల్లటి దట్టమైన పొగ వస్తున్నట్లు యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ పేర్కొన్నది.
ఉక్రెయిన్ దళాలు రష్యాలోకి చొరబడ్డాయి. సుమారు 30 కిలోమీటర్ల లోపలికి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఉక్రెయిన్ దళాలు డ్రోన్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగినా.. రేడియేషన్ లేదని జపొరిజియా గవర్నర్ తెలిపారు. న్యూక్లియర్ లీక్ వల్ల రేడియేషన్ ప్రమాదం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వెల్లడించారు. అయితే తమ దేశాన్ని కించపరిచేందుకు రష్యానే ఆ ప్లాంట్‌లో అగ్నిప్రమాదాన్ని సృష్టించినట్లు ఆయన ఆరోపించారు.
డ్రోన్లతో దాడి చేయడం వల్ల పవర్ ప్లాంట్‌లోని ఫెసిలిటీ సెంటర్లో మంటలు వ్యాపించినట్లు రష్యా న్యూక్లియర్ పవర్ ఏజెన్సీ రోసాటమ్ తెలిపింది. కూలింగ్ టవర్స్‌కు తీవ్రంగా డ్యామేజ్ జరిగినట్లు చెప్పింది. అణు కేంద్రాలను టార్గెట్ చేసే రీతిలో దాడులు జరిగినట్లు ఆ సంస్థ సీఈవో అలెక్సే తెలిపారు. ముందుజాగ్రత్తగా ప్లాంట్‌లో ఉన్న ఆరు రియాక్టర్లను ప్రస్తుతం షట్‌డౌన్ చేశారు.