UK couple : ఆ ఇద్దరూ 52 ఏళ్ల కిందట ఒక్కటయ్యారు. ఐదు దశాబ్దాలకుపైగా అన్యోన్యంగా దాంపత్య జీవనం గడిపారు. వారికి సంతానం లేకపోయినా వారి కుటుంబాలతో కలిసి సంతోషంగా బతికారు. కుటుంబంలోని పిల్లలనే తమ కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఆనందంగా కాలం గడిపారు. వృద్ధాప్యంలో ఆ అన్యోన్యం దంపతులను చూసి విధికి కన్నుకుట్టింది. వారి బతుకులను విషాదాంతం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన డేవిడ్ (80), సుసాన్ జెఫ్కాక్ (74) ఇద్దరు దంపతులు. దాదాపు ఐదు దశాబ్దాలకుపైగా వారు గువ్వాగోరింకల్లా కలిసి బతికారు. కానీ ఆ వృద్ధ దంపతుల జీవితాలను మాయదారి రోగం విషాదాంతం చేసింది. డేవిడ్‌కు బోన్ క్యాన్సర్ ఉందని బయటపడటంతో ఆ వృద్ధ జంట కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ జంట ముఖాల్లో నవ్వులు మాయమైపోయాయి.
డేవిడ్ ఎక్కువ రోజులు బతకడని వైద్యులు తేల్చిచెప్పారు. దాంతో సుసాన్ జెఫ్కాక్ వెక్కివెక్కి ఏడ్చింది. ‘నిన్ను విడిచి నేను బతకలేను. నువ్వు లేని భయంకరమైన జీవితాన్ని ఊహించుకోలేను. నీతోపాటే నేను కూడా వస్తా’ అని భర్తకు చెప్పింది. అతడు వారించినా వినకుండా తన మాట నెగ్గించుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
తమ మరణాలు కుటుంబసభ్యులను బాధపెడుతాయని, కానీ తమకు ఇంతకంటే మార్గం లేదని, తమను క్షమించాలని కోరుతూ డేవిడ్ ఒక లేఖను రాశారు. తాను నొప్పి భరించలేక చావాలనుకుంటున్నానని, సుసాన్ కూడా తనతో రావాలని కోరుకుంటున్నదని, అందుకే ఇద్దరం చనిపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.
అనంతరం ఇద్దరూ న్యూయార్క్షైర్లోని ఓ కొండ దగ్గరికి వెళ్లారు. 199 మెట్లు ఎక్కి 180 అడుగుల ఎత్తులో ఉన్న ఓ శిఖరం అంచుకు చేరుకున్నారు. అక్కడ ఒకరి చేయి ఒకరు పట్టుకుని, చివరిసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకుని అమాంతం కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
దంపతుల ఆత్మహత్యపై డేవిడ్ మేనల్లుడు కెవిన్ స్పందించారు. డేవిడ్.. ట్యాక్సీ బస్ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారని తెలిపారు. ఆయన అందరితో సరదాగా గడిపేవారని, మా కుటుంబం అంతా కలిసిన ప్రతిసారి ఆయన నవ్వులు పూయించేవారని గుర్తుచేసుకున్నారు. అనారోగ్యాన్ని భరించలేక ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడటం కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.