హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్లు రాజకీయ కేంద్రాలుగా మారుతున్నాయన్న విమర్శలకు ఊతమిచ్చే మరో సంఘటన తెలంగాణ రాజ్‌భవన్‌లో చోటు చేసుకున్నది. తెలుగు ఉగాది వేడుకల పేరుతో శుక్రవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమం విమర్శలకు వేదికగా మారింది. తెలుగు ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్టానికి చెంది న ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది పాల్గొనలేదు. తమిళిసై పుదుచ్చేరి గవర్నర్‌గా కూడా పనిచేస్తున్నందున ఆ రాష్ర్టానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు, రాష్ట్ర బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు, కొందరు నేతలు, రెగ్యులర్ అతిథులు మాత్ర మే ఇందులో కనిపించారు. తెలంగాణలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 24 మంది ఎంపీలుండగా వారిలో నాలుగైదు శాతం కూడా కార్యక్రమానికి రాకపోవడంతో వేడుకల్లో జోరు కొరవడింది. కారణాలు తెలియదుగానీ రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా పెద్దగా హాజరుకాలేదు. దీంతో ఇలా ఎందుకు జరిగిందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘రాజ్‌భవన్ చరిత్రలో ఇంతలా వెలవెలబోయిన కార్యక్రమం మరొకటి లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో రాజ్‌భవన్‌లో ఏ కార్యక్రమం కూడా ఇంత కళావిహీనంగా జరగలేదు. ఎక్కడో ఏదో తేడా కనిపిస్తున్నది’ అని సుదీర్ఘ కాలంగా రాజ్‌భవన్‌లో పని చేస్తున్న సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనివల్ల రాజ్‌భవన్ ప్రతిష్ఠ, ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్‌భవన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ ఆహ్వానాలు పంపించానని, రాని వారి గురించి తాను మాట్లాడలేనని గవర్నర్ ఆ తర్వాత వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భిన్నమైన వాదన వినిపిస్తున్నది. ‘అది తెలంగాణ రాజ్‌భవన్. జరుగుతున్నది తెలంగాణ (తెలుగు) ఉగాది వేడుకలు. అలాంటి కార్యక్రమంలో తెలంగాణ ప్రజల ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి ఫొటో లేకుండా, ఫ్లెక్సీపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే పెట్టడం ఎక్కడి సంప్రదాయం? ఎలాంటి సంప్రదాయం? రాష్ట్రంలో ఏం జరిగినా తెలుసుకునే ముఖ్యమంత్రి ఈ విషయం గుర్తించలేరా? ఈ విషయం తెలిసే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి రాలేదేమో! ఇందు లో వారిని తప్పుబట్టాల్సింది ఏమీ లేదు. వారి నాయకుడికి మర్యాద ఇవ్వని చోటుకు వారెందుకు వస్తారు?’ అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఉగాది వేడుకల ఫ్లెక్సీపై రాష్ట్ర సీఎం ఫొటో లేకపోవడం కచ్చితంగా ఆయనను అవమానించే ప్రయత్నమేని ఒక పాత్రికేయుడు కూడా అభిప్రాయపడ్డారు. చేసేదంతా చేసి తనకు ఎ లాంటి భేషజాలూ, ఈగోలు లేవని గవర్నర్ వ్యాఖ్యానించడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. కొన్ని సంప్రదాయాలు, మర్యాదల విషయం లో ముందే జాగ్రత్తగా ఉండాలని, కేవలం ఆహ్వానాలు పంపి, రాలేదని తప్పుబట్టే తీరు సరికాదని అన్నారు.
‘గత కొంతకాలంగా దేశంలో గవర్నర్ల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్నది. కేరళ, బెంగాల్ తదిత ర రాష్ర్టాల్లో ఇది ముదురు పాకానపడుతున్నది. తెలంగాణ రాజ్‌భవన్ ఇందుకు భిన్నంగా ఉంటుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి డైరెక్షనో లేక పార్టీ అఫ్లియేషన్ ప్రభావమో తెలియదుగానీ తెలంగాణ రాజ్‌భవన్ కూడా సంప్రదాయాలను, మర్యాదలను పట్టించుకోవడం లేదు’ అని రాజ్‌భవన్ వ్యవహారాలను దగ్గరి నుంచి గమనించే ఒక అధికారి చెప్పారు. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు, లోపల గిచ్చుతూ పైకి మెరమెచ్చులు మాట్లాడటం వల్ల ఎవరికి ఉపయోగం? ఇవాళ జరిగిన దానివల్ల ఎవరి విలువ ఎవరు పోగొట్టుకున్నారు? ఎవరు మర్యాద కోల్పోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఎవరేం చెప్పినా ప్రభుత్వాధినేతే రాష్ట్ర ప్రజలకు అసలు సిసలు ప్రతినిధి. గవర్నరైనా, మరొకరైనా ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాల్సిందే’ అని శుక్రవారం నాటి పరిణామాలను దగ్గరగా గమనించిన సీనియర్ పాత్రికేయుడొకరు వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఘర్షణ వైఖరికి కారణమయ్యేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఫ్రెండ్లీగా ఉంటా. కొట్లాడాలని లేదు అంటూనే నేనెవరికీ తలవంచను అంటారు. ప్రభుత్వానికి కాంప్లిమెంట్‌గా ఉంటాను అంటూనే రెగ్యులర్‌గా ప్రజా దర్బార్ నిర్వహిస్తానంటారు. తెలంగాణ ప్రజలను ప్రేమిస్తా, గౌరవిస్తా అంటూనే వారు ఎన్నుకున్న ముఖ్యమంత్రి విషయంలో మరోలా వ్యవహరిస్తారు. వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదంటూనే ప్రతిసారీ బహిరంగంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా కామెంట్లు చేస్తారు. మాటకు చేతకు మధ్య ఏదో గ్యాప్ ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది కాకలుతీరిన రాజకీయ నాయకుడు. మాటల అంతరార్థాన్ని, చేతల లోతును పసిగట్టలేని వ్యక్తి కాదు ఆయన’ అని సీనియర్ రాజకీయ నాయకుడొకరు అన్నారు. అసలు రాజకీయ కేంద్రాలుగా పనిచేసే రాజ్భవన్లు మనకు అవసరమా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
‘రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చా. రెగ్యులర్‌గా ప్రజా దర్బార్లు నిర్వహిస్తా. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాజ్‌భవన్ ముందు గ్రీవెన్స్బాక్స్ ఏర్పాటు చేస్తా. రాజ్‌భవన్‌లో ప్రజలకు ఫ్రెండ్లీ గవర్నర్ ఉన్నారు.. ఇలాంటి బిట్వీన్ ద లైన్స్ మాటల అంతరార్థం ఏమిటి? రాజ్యాంగం గవర్నర్ పాత్రను స్పష్టంగా నిర్వచించింది. బాధ్యతలేమిటో చెప్పింది. అవి తెలియదనుకోవాలా? తెలిసీ చేస్తున్నారనుకోవాలా?’ అని శుక్రవారం నాటి కార్యక్రమానికి హాజరైన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య అభిప్రాయభేదాలు సహజమని, అంతమాత్రాన ప్రభుత్వంతో డిఫరెన్సెస్ ఉన్నాయని బహిరంగ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ‘రాజ్భవన్లు ఒకప్పుడు కాంగ్రెస్ కార్యాలయాలుగా ఉండేవి. ఇప్పుడు బీజేపీ కార్యాలయాలుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించే పక్షాలకు రాజ్‌భవన్ అండదండలు ఉంటాయని సంకేతాలు అందటం రాజ్‌భవన్‌కు గానీ, గవర్నర్ వ్యవస్థకుగానీ, రాష్ర్టానికిగానీ అంత మంచిది కాదు’ అని ఆయన హితవు పలికారు. ఈ అవాంఛనీయ పరిణామాలకు కారణం ఏమిటనేది రాజ్‌భవన్ వర్గాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ పాత్రికేయుడొకరు అన్నారు. ‘క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారిని కేంద్రం గవర్నర్లుగా నియమిస్తున్నది. వారికేమో రాజకీయాలపై అనురక్తి పోవడం లేదు. కానీ ప్రజా నాయకులైన ముఖ్యమంత్రులతో పెట్టుకున్న ప్రతిసారీ గవర్నర్లే భంగపడ్డారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం’ అని కూడా ఆయన విశ్లేషించారు. ‘అందర్నీ పిలిచినా ఎవరూ రాలేదని రాజ్‌భవన్ చెప్తున్నది. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో, ఇలాంటి వాతావరణం ఎందుకు ఏర్పడిందో ఆలోచించుకోవాలి. అసలు అంత హడావుడిగా ఉత్సవాలు జరపాలన్న తపన ఎందుకు? ఆఖరిక్షణం ఆహ్వానాలెందుకు? అభాసుపాలుకావడమెందుకు? తర్వాత ఆక్రోశించడమెందుకు? ఇది కేవలం రాజ్‌భవన్‌కు సంబంధించిన అంశం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠతో ముడివడిన విషయం కూడా. ఇలాంటి పరిణామాలు ఎవరికి మంచివి?’అని మాజీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. అత్యున్నత పదవులు నిభాయిస్తున్నవారు కొంత ఓపికతో, సంయమనంతో, సమన్వయంతో ఉండాల్సిన అవసరాన్ని శుక్రవారం నాటి పరిణామం గుర్తు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో హోదా అనేది నిష్పక్షపాతంగా ఉండడానికి ఒక అవకాశం. ఈ హోదాతో అత్యున్నత ప్రమాణాలూ నెలకొల్పవచ్చు. అందుకు ప్రయత్నించడం శ్రేయస్కరం. ముఖ్యమంత్రి ఫొటో పెట్టకుండా ఆయనగానీ, అధికారపార్టీ నేతలుగానీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయడం అర్థం పర్థం లేనిది’ అని ఒక పాత్రికేయుడు అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద గత కొంతకాలంగా తెలంగాణ రాజ్‌భవన్ వ్యవహారశైలి కూడా ఏమంత సామరస్యపూర్వకంగా లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాజ్‌భవన్ ఉగాది వేడుకల్లో చిన్న అపశృతి దొర్లింది. గవర్నర్ తమిళిసై కుర్చీలో కూర్చొనబోతుండగా పట్టుతప్పి తూలి కిందపడినట్టు తెలిసింది.