సుబేదారి,ఆగస్టు 3 : ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను కాకతీయ యూనివర్సిటీ, సీసీఎస్ పోలీసులు పట్టుకొని 28 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ ఎన్ శ్వేత నిందితుల అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా ఇందిరమ్మకాలనీకి చెందిన పీకే రాజయ్య, ఇదే జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ కలిసి వరంగల్, కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, హైదారాబాద్, రాచకొండ కమిషనరేట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 28 బైక్‌లు చోరీ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్‌లపై డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. కేయూ పీఎస్ పరిధిలో పల్సర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించిన రాజయ్య, సాయి కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు కేయూ పీఎస్ మునిపల్లి, ఎల్కతుర్తి సమీప ప్రాంతాల్లో దాచిపెట్టిన 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. వాహనదారులు తమ బైక్‌లు పార్కింగ్ చేసినప్పుడు తప్పక హ్యాండిల్‌తో పాటు వీల్ లాక్ చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, హరికృష్ణ, కేయూ ఇన్స్పెక్టర్ రవికుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్‌రాజు, సిబ్బందిని సీపీ అభినందించారు.