న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ తయారీ రంగ కార్యకలాపాల్లో వృద్ధి ఈ ఏడాది జూలై నెలలో ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల నడుమ మందగించిన కొత్త వ్యాపార ఆర్డర్లే ఇందుకు కారణమని తేలింది. ఈ క్రమంలోనే సోమవారం విడుదలైన సర్వేలో హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.5కు తగ్గింది. అంతకుముందు నెల జూన్లో ఇది 54.2గా ఉన్నది. దీంతో 2021 ఆగస్టు నుంచి గమనిస్తే.. ఇదే కనిష్ఠంగా తేలింది. కాగా, కొత్త ఆర్డర్లతోపాటు ఉత్పత్తి, ఉపాధి, సప్లయర్ డెలివరీ వేళలు, స్టాక్స్ కొనుగోలు అంశాల ఆధారంగా పీఎంఐ గణాంకాల గణన ఉంటుంది.
ఉపాధి సృష్టిలో నిరాశ
జూలైలో కొత్త ఆర్డర్లలో వృద్ధిరేటు గడిచిన నాలుగేండ్లకుపైగా కాలంలో రెండో అత్యంత కనిష్ఠ స్థాయికి క్షీణించినట్టు చెప్తున్నారు. అలాగే ఉపాధి సృష్టి సైతం దేశీయ ఉత్పాదక రంగ పరిశ్రమలో వరుసగా మూడో నెల దిగజారిందని సర్వేలో ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మే, జూన్, జూలై నెలల్లో కొత్త ఉద్యోగాలు అంతగా ఆశాజనకంగా లేవని వివరిస్తున్నారు.