Children | అల్లాదుర్గం, మార్చి 3: కన్నతల్లి కొడుతుందనే భయంతో ఇంటి నుంచి పారిపోతున్న ఇద్దరు చిన్నారులను ఉపాధి హామీ కూలీలు చేరదీశారు. తర్వాత ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం కాయిదంపల్లిలో శుక్రవారం చోటు చేసుకున్నది.
ఐసీడీఎస్ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాయిదంపల్లికి చెందిన కర్రెళ్ల మొగులయ్య-పాపమ్మ దంపతులకు ప్రియాంక (10), మధుప్రియ (7) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తండ్రి మొగులయ్య మరణించడంతో తల్లి ఇద్దరు చిన్నారులతో జీవనం గడుపుతున్నది. భర్త లేకపోవడంతో పాపమ్మ మానసికంగా కుంగిపోయి మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో తన పిల్లలను తరుచూ కొడుతుండటంతో వారు కొన్నాళ్లుగా బంధువుల ఇళ్లల్లో ఉంటున్నారు. గురువారం రాత్రి 161వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులను అల్లాదుర్గం వాసి శ్రీశైలం గమనించాడు. చిన్నారులతో మాట్లాడగా సరైన సమాధానం రాలేదు. దీంతో అనుమానంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శుక్రవారం ఉదయం మళ్లీ చిన్నారులు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా కాయిదంపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు చేరదీశారు. చిన్నారులను వారి ఇళ్లకు తీసుకెళ్లి కొత్త దుస్తులు వేసి, భోజనం పెట్టారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీవో వెంకటరమణ, సూపర్వైజర్ నామణి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ‘మమ్మీ కొడుతుంది, ఇంటికి వెళ్లం’.. అని చెప్పిన చిన్నారులను అధికారులు ఎంత సముదాయించినా ఇంటికి వెళ్లడానికి నిరాకరించారు. దీంతో వారిని డీసీపీయూ నాగరాజు సమక్షంలో మెదక్ జిల్లా బాలసదన్‌కు తరలించారు.