లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఏనెబావి గ్రామపంచాయతీకి ఇద్దరు కార్యదర్శులను నియమించడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో లింగాల గణపురం మండలం నుండి 14 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ ఆ స్థానంలో ఇతర మండలాల్లో పనిచేస్తున్న కార్యదర్శులను నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాణిక్యపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏనెబావి.. పిట్టలోని గూడెం గ్రామాలను కలుపుతూ ఏనెబావి గ్రామపంచాయతీని ఏర్పాటు చేశారు.
ఈ కొత్త పంచాయతీ పరిధిలో 700 మంది జనాభా..300 మంది ఓటర్లు.. 150 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న సీతారాం నాయక్ జనగామ మండలం చీటకోడూరుకు బదిలీ చేసి ఆయన స్థానంలో బంజారాలో పనిచేస్తున్న చితిరాల సంధ్యారాణిని, సీతా తండాలో పనిచేస్తున్న ఉపేందర్ ను ఏనెబావి పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. చిన్న పంచాయతీకి ఇద్దరు కార్యదర్శులను నియమించడంపై ఆ గ్రామస్తులు అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు