పాట్నా: మనం గోడ ఎక్కాలంటే నిచ్చెన ఉండాల్సిందే. లేదా ఏదైనా సపోర్ట్ ఉంటే ఎక్కేయగలం. అయితే, బీహార్‌కు చెందిన అక్కాచెల్లెళ్లకు ఎలాంటి సపోర్ట్ అవసరంలేదు. 12 అడుగుల గోడను అవలీలగా ఎక్కేస్తారు. అందుకే వీళ్లను స్పైడర్ గర్ల్స్ అంటున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
బీహార్ రాజధాని పాట్నాకు చెందిన అక్షితా గుప్తా (11) ఎలాంటి శిక్షణలేకుండా మొదట 12 అడుగుల గోడ ఎక్కింది. అక్కను చూసి స్ఫూర్తిపొందిన చెల్లె క్రిపితా (9) కూడా గోడలు ఎక్కడం ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు అక్షిత, క్రిపిత ఇద్దరూ ఎలాంటి సపోర్ట్ లేకుండా నునుపుగా ఉండే మార్బుల్ గ్రానైట్ గోడపైకి ఎక్కుతున్నారు.
ఓ వర్చువల్ ప్రదర్శనలో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎలాంటి సపోర్ట్ లేకుండా 12 అడుగుల పిల్లర్ ఎక్కి ఆశ్చర్యపరిచారు. ఇంట్లో అమ్మానాన్న లేనప్పుడు గోడలు ఎక్కడం ప్రాక్టీస్ చేశానని అక్షిత తెలిపింది. ఓ రోజు తాను గోడలు ఎక్కుతుండడం చూసిన తన అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారని వివరించింది. స్పైడర్‌మ్యాన్‌లా గోడలు ఎక్కుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. త్వరలో హిమాలయాల శిఖరాలను అధిరోహిస్తానని అక్షిత ఆశాభావం వ్యక్తంచేసింది.