Mexico Earthquake | మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్మాక్రోస్కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని వల్ల ఏకంగా 33 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 50 వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో అకాపుల్కో సమీపంలో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర దిశగా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీ వరకు వ్యాపించింది. భూకంపం హెచ్చరికల సైరన్లు మోగడంతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మెక్సికో సిటీలో జనాలు బయటకు పరుగులు తీస్తున్న క్రమంలో ఓ అపార్ట్మెంట్లోని రెండో అంతస్తు నుంచి పడి 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మంది గాయపడ్డారని నగర మేయర్ క్లారా బ్రుగాడా తెలిపారు. అలాగే భూకంప కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు కూలడంతో 50 ఏళ్ల మహిళ మృతి చెందిందని గెరెరో గవర్నర్ ఎవలిన్ సాల్గోడో పేర్కొన్నారు.
భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ఆపేశారు. అధ్యక్షురాలితోపాటు సిబ్బంది, మీడియా అంతా అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చేశారు.