Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21 ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సీజన్ ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొనగా, ముఖ్యంగా విజేత ఎవరు అనే ఉత్కంఠ చివరి క్షణం వరకు కొనసాగింది. దీంతో సాధారణ ప్రేక్షకుల నుంచి బిగ్‌బాస్ అభిమానుల వరకు అందరూ టీవీల ముందు కూర్చుని ఫినాలేను ఆసక్తిగా వీక్షించారు. కొందరు స్టార్ మా టీవీలో చూడగా, మరికొందరు జీయో హాట్‌స్టార్ ద్వారా ఫినాలేను వీక్షించారు. ఈ ఉత్కంఠభరిత ఫినాలేకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. తాజాగా విడుదలైన టీఆర్పీ గణాంకాలు బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ ఫినాలే కొత్త రికార్డును సృష్టించినట్టు వెల్లడించాయి. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 19.6 టీవీఆర్ రేటింగ్ నమోదవడం విశేషం. గత ఐదు సీజన్లలో ఇదే అత్యధిక రేటింగ్‌గా నిలవడం బిగ్‌బాస్ షో క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.
ఈ సంతోషకరమైన విషయాన్ని షో హోస్ట్ నాగార్జునతో పాటు స్టార్ మా అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాగార్జున తన పోస్ట్‌లో బిగ్‌బాస్ తెలుగు 9ను “అజేయం, అద్వితీయం”గా అభివర్ణించారు. టీవీలో 19.6 టీవీఆర్‌తో పాటు జీయో హాట్‌స్టార్‌లో 285 మిలియన్ నిమిషాల వ్యూస్ వచ్చినట్టు తెలిపారు. గత ఐదేళ్లలోనే బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఇది అతిపెద్ద ఫినాలేగా నిలిచిందని పేర్కొన్నారు. భావోద్వేగాలు, ఉత్కంఠ, పోటీలు, మరిచిపోలేని క్షణాలతో నిండిన సీజన్ ఇదని చెప్పారు. ఈ ప్రయాణాన్ని విజయవంతం చేసిన కంటెస్టెంట్లకు, స్టార్ మా టీమ్‌కు, జీయో స్టార్, ఎండెమాల్ షైన్ ఇండియా బృందానికి, ముఖ్యంగా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జున చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సీజన్ విషయానికి వస్తే, నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు 9 మొత్తం 22 మంది కంటెస్టెంట్లతో సాగింది. ప్రారంభంలో 15 మంది హౌస్‌లోకి అడుగుపెట్టగా, ఆ తర్వాత ఒకరు మిడ్ ఎంట్రీగా, ఆరుగురు వైల్డ్ కార్డ్స్‌గా వచ్చారు. ఈ సీజన్లో ఏడుగురు కామనర్స్ ఉండగా, మిగతా వారు సెలబ్రిటీలుగా పాల్గొన్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కామనర్‌గా వచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. తనూజ రన్నరప్‌గా నిలవగా, మూడో స్థానంలో డీమాన్ పవన్ నిలిచాడు. అయితే అతడు 15 లక్షల రూపాయల సూట్‌కేస్ తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయెల్, ఐదో స్థానంలో సంజనా నిలిచారు.