Aadi | యంగ్ హీరో ఆది సాయి కుమార్ జీవితంలో ప్రస్తుతం సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూసిన ఆది, తాజాగా వచ్చిన ‘శంబాల’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో ఆది ఖాతాలో ఎట్టకేలకు మరో హిట్ పడింది. ఈ సక్సెస్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగానే, ఆయన ఇంట్లో మరో శుభవార్త వెలువడింది. తాజాగా ఆది సాయి కుమార్ భార్య అరుణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆది కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఇప్పటికే ఈ దంపతులకు ఒక కూతురు ఉండగా, 2026 ప్రారంభంలో రెండో బిడ్డగా మగబిడ్డ పుట్టడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. శంబాల సక్సెస్‌తో కెరీర్ పరంగా, బిడ్డ జననంతో పర్సనల్ లైఫ్‌లో ఒకేసారి రెండు శుభవార్తలు రావడంతో ఆది ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆది సాయి కుమార్ 2014 డిసెంబర్లో రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుణను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ లవ్లీ కపుల్ తమ కుటుంబ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోంది. తాజాగా పుట్టిన మగబిడ్డతో సాయి కుమార్ ఇంట సంబరాలు మరింత ఘనంగా జరుగుతున్నాయి.
ఆది సినీ కెరీర్ విషయానికి వస్తే.. 2011లో ‘ప్రేమ కావాలి’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు, ఆది నటనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి గాను ఫిలింఫేర్, సీమా అవార్డుల్లో బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డులను సైతం అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ, సుకుమారుడు (2013), గలిపటం (2014), గరం (2016), శమంతకమణి (2017), బ్లాక్ (2022), తీస్ మార్ ఖాన్ (2022) వంటి సినిమాలు చేశాడు. దాదాపు 25 సినిమాల్లో నటించినప్పటికీ, హిట్లు మాత్రం మూడు నాలుగే ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఆది నటనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత వచ్చిన శంబాల హిట్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన ఆది, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా, ఆది ఒక మంచి క్రికెట్ ప్లేయర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా కెరీర్, కుటుంబం రెండింట్లోనూ ఒకేసారి వచ్చిన శుభవార్తలతో ఆది సాయి కుమార్‌కు 2026 మంచి ఆరంభాన్ని అందించిందని చెప్పవచ్చు.