Tirupati | తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ భద్రతలో మరోసారి డొల్లతనం బయటపడింది. ఏకాంత సేవ ముగిశాక సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఉన్న అతను విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయ గోపురం ఎక్కి అరుస్తూ కలశాలు లాగే ప్రయత్నం చేశాడు.
ఇది గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది కిందకు దిగాలని ఆ వ్యక్తికి సూచించాడు. అతడు మాత్రం దిగేందుకు నిరాకరించాడు. తనకు మందు బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని పట్టుబట్టాడు. అలా దాదాపు మూడు గంటలపాటు ఇబ్బంది పెట్టాడు. దీంతో నిచ్చెన సాయంతో ఫైర్ సిబ్బంది గోపురం పైకి ఎక్కి మందుబాబును కిందకు దించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, ఆలయ గోపురంపై కలశాలు, విద్యుత్ దీపాలను అతను డ్యామేజి చేసినట్లుగా గుర్తించారు.
గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడని.. మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్
తిరుపతిలో భద్రతా వైఫల్యం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం
ఏకాంత సేవ ముగిసాక మద్యం మత్తులో ఆలయం గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించి, గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు యత్నించిన మందుబాబు
చాలా సేపు ప్రయత్నించి నిందితుడిని కిందికి దింపిన పోలీసులు pic.twitter.com/M99NwdDjie
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026