హైదరాబాద్ : తెలంగాణలో అక్కడక్కడ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. సముద్రమట్టానికి 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, వికారాబాద్, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.