న్యూఢిల్లీ, నవంబర్ 5: శారీరక వ్యాయామం మెదడును నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా అడ్డుకుంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాయామం వల్ల మెదడు పెద్దదవుతుందని తెలిపింది. వారానికి రెండు, మూడు రోజులు చేసే తక్కువ స్థాయి మొదలుకొని తీవ్ర వ్యాయామానికి, మెదడులోని మొత్తం భాగాలకు సంబంధం ఉంటుందని కెనడియన్-అమెరికన్ పరిశోధన బృందం తెలిపింది. జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తిలో కీలకమైన హిప్పోక్యాంపస్, టెంపోరల్ లోబ్లలో పెరుగుదల ఉంటుందని చెప్పింది. అధ్యయనంలో పాల్గొన్నవారి మెదళ్ల ఎంఆర్ఐ స్కాన్లను డీప్-లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ సాయంతో పరిశీలించి మెదడు బరువులోని మార్పులను పరిశోధకులు విశ్లేషించారు. మిత లేదా తీవ్ర వ్యాయామం చేసిన రోజుల్లో మెదడు బరువు పెరగడాన్ని గమనించారు. వ్యాయామం సందర్భంగా విడుదలయ్యే బీడీఎన్ఎఫ్ ప్రొటీన్ మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ఇది మెదడును నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేసే కీలక అంశాల్లో ఒకటి కావొచ్చని అభిప్రాయపడ్డారు. రోజువారీ తేలికపాటి వ్యాయామాలు కూడా మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయని వెల్లడించారు.