తిరుమల : ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) నిర్వహిస్తున్నామనిటీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ( EO Ravi Chandra ) తెలిపారు. జిల్లా, పోలీసులు, అధికారులు సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ సెప్టెంబరులో సాలకట్ల, అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన అన్న ప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా పెట్టుకోవాలని సూచించారు.
గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ఆర్టీసీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారికి నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని చెప్పారు.అనంతరం ఈవో అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.