హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గుండెపోటుతో కన్నుమూశా రు. విశాఖలో కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన శేషాద్రి ఆదివారం రాత్రి 8 గంటలకు కల్యాణమండపంలో జరిగిన స్వామివారి పవళింపు సేవలో పాలొన్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే టీటీడీ అధికారులు రామ్‌నగర్‌లోని అపోలో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. గతంలోనూ ఆయనకు గుండెపోటు వచ్చింది. శేషాద్రి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. మంగళవారం తిరుపతి గోవిందధామంలో శేషాద్రి అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు.
నాలుగు దశాబ్దాలుగా శ్రీవారి సేవలో
1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరిస్తున్నా రు. 2007లోనే రిటైర్ అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించిన టీటీడీ ఓఎస్డీగా కొనసాగిస్తున్నది. తిరుమలలో శేషాద్రి శ్రీవారి బంగారుడాలర్లు అమ్మేవారు. అందుకే డాలర్ శేషాద్రి అని పేరు వచ్చింది. శ్రీవారి దర్శనానికి ప్రముఖులు వస్తే శేషాద్రి దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించారు. శేషాద్రి మృ తిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పదవులతో నిమిత్తం లేకుండా శ్రీవారికి సేవలందించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తంచేశారు.
శేషాద్రి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్న ట్టు ట్వీట్ చేశారు. శేషాద్రి మృతి దిగ్భ్రాంతికి గురిచే సిందని మంత్రి హరీశ్‌రావ్ పేర్కొన్నారు. శేషాద్రి హ ఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చం ద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. శేషాద్రి మృతి బాధాకరమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శే షాద్రి మరణం కలిచివేసిందని శారదాపీఠాధిపతి స్వ రూపానందేంద్రస్వామి అన్నారు. టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. శ్రీవారి సేవలో తరించడమే జీవితలక్ష్యంగా శేషాద్రి బతికారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
అంత్యక్రియలకు హాజరుకానున్న సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. శేషాద్రి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీనుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని తిరుపతిలోని శేషాద్రి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించనున్నారు. శేషాద్రి ఆకస్మికమృతి దిగ్భ్రాంతిని కలిగించిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఆయ న మృతి దేవస్థానానికి, భక్తకోటికి తీరనిలోటని అన్నారు.