తిరుమల : ఆపద మొక్కులవాడు.. ఆపద్భాందవుడు తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకు చెందిన భక్తుడు ( Chennai Devotee ) పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మగేష్ సుందర్ శుక్రవారం రూ.40 లక్షలు విలువచేసే టోయోటా ఇన్నోవా హైక్రాస్ వి.జెడ్ మోడల్ కారు ( Innova Car ) ను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు కారు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,722 మంది భక్తులు దర్శించుకోగా 36,705 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.45 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.