Shiva Jyothi | యాంకర్ శివ జ్యోతి గురించి బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తీన్మార్ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయిన శివజ్యోతి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొందింది.ప్రస్తుతం అడపాదడపా టీవీ షోలలో పాల్గొంటూ సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది. అయితే రీసెంట్గా శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చునే వారికి ఇచ్చే అన్నప్రసాదంపై సంచలన కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు విమర్శలపాలైన విషయం తెలిసిందే. భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన సమయంలో చేసిన “రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం” వ్యాఖ్య భక్తుల కోపాన్ని రగిలించింది. ఈ ఘటనపై విమర్శలు పెరగడంతో శివ జ్యోతి వెంటనే క్షమాపణలు చెప్పింది. అయిన వివాదం పూర్తిగా చల్లారలేదు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు శివ జ్యోతి గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేశారని, దీంతో భవిష్యత్తులో తిరుమల శ్రీవారి దర్శనం పొందే అవకాశమే లేకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది. ప్రసాదాన్ని అవమానించినందుకే ఈ చర్య తీసుకున్నారని అంటున్న హిందూ సంఘాలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. గతంలో ఆమె పోస్ట్ చేసిన బాత్రూమ్ వీడియో కూడా వివాదాలకు తావిచ్చిన విషయం తెలిసిందే.
“తీన్మార్” కార్యక్రమంలో “సావిత్రక్క”గా పాపులర్ అయిన శివ జ్యోతి జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, తన ప్రత్యేకమైన తెలంగాణ యాసతో మంచి గుర్తింపు సంపాదించారు. బిగ్ బాస్ సీజన్ 3లో 98 రోజులు ఉండి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె, ఆ తర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ మంచి అభిమానాన్ని సంపాదించారు. ‘జ్యోతక్క’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, భర్తతో కలిసి సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటున్నారు.