వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 14: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆర్టీసీలో 14 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఓ పేద కుటుంబంలో సంతోషం నింపింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఆర్సీఐ వద్ద సాయంత్రం 6.15 గంటలకు ఆటో ఆగిపోయింది. అందులో 70 ఏండ్ల చాంద్ బీబీ నానీతోపాటు ఆమె భర్త, బాలింత అయిన కుమార్తె, కొడుకు, నలుగురు మనవరాళ్లు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు. అరగంట తర్వాత ఆ మార్గంలో కల్వకుర్తి ఎక్స్‌ప్రెస్ రాగా.. చాంద్ బీబీ నానీతోపాటు మొత్తం 11 మంది బస్కెక్కారు. నానీ దగ్గర రూ.500 ఉండగా.. రూ.300 ఆటో పెట్రోల్కుపోను 200లే మిగిలాయి. ఆమన్‌గల్ పోవాలని, 200 రూపాయలే (అందరి టికెట్‌కు దాదాపు రూ.400 అవుతాయి) ఉన్నాయని కండక్టర్‌కు ఇచ్చింది. నలుగురికే టికెట్ తీసుకున్న కండక్టర్.. ‘బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు 14 ఏండ్లలోపు పిల్లలకు ఆర్టీసీలో ప్రయా ణం ఉచితం’ అని చెప్పడంతో అంతా సంతోషపడ్డారు.