హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణ జిల్లాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు పంపిణీ చేస్తున్న టీఎస్ ఎన్పీడీసీఎల్కు అవార్డుల పంటపడింది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ) ప్రకటించిన అవార్డుల్లో.. సంస్థ పలు క్యాటగిరీల్లో ఏడు అవార్డులు దక్కించుకున్నది. డిస్కం చరిత్రలో ఒకేసారి ఇన్ని అవార్డులు రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న కర్ణాటకలోని బెల్గాంలో జరిగే 22వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ రిట్రీట్ కార్యక్రమంలో అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనికత, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మార్గదర్శనంలో వినియోగదారులకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నట్టు చెప్పారు. డిస్కంకు అవార్డులకు రావడానికి కృషిచేసిన ఉద్యోగులను సీఎండీ అభినందించారు.
ఏడు క్యాటగిరీల్లో దక్కిన పురస్కారాలు ఇవే..
డిస్కం పరిధిలోని 17 జిల్లాల్లో 63 లక్షల వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తు అందించడం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరాకుగాను బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అవార్డు
డిస్కం పరిధిలో పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించినందుకు బెస్ట్ స్టేట్ టు ప్రమోట్ రెన్యువబుల్ ఎనర్జీ అవార్డు
విద్యుత్తు ప్రమాదాల నివారణలో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, పత్రికలు, టీవీల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసినందుకు బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టు ప్రమోట్ కన్స్యూమర్ అవేర్నెస్ అవార్డు
రెండేండ్లలో 2.28,396 గ్రామీణ గృహ వినియోగదారులకు యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్లు ఇచ్చినందుకుగాను ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ యుటిలిటీ అచీవింగ్ ఫాస్టెస్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ లాస్ట్ డికేడ్ అవార్డు
33/11 కేవీ సబ్స్టేషన్లల్లో ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంక్స్‌ను పెట్టడం ద్వారా నష్ట నివారణ చర్యలు, 11 కేవీ ఫీడర్లపై భారం పడకుండా చూసినందుకు ఎరెక్షన్ ఆఫ్ 2/1 ఎంవీఏఆర్ కెపాసిటీ బ్యాంక్స్, అండ్ 600 కేవీఏఆర్ లైన్ కెపాసిటర్స్ అవార్డు
గ్రిడ్ ఫీక్వెన్సీకి అనుగుణంగా సోలార్‌పవర్‌ను 33 కేవీ లైన్లకు అనుసంధానం చేయడం ట్రాన్స్మిషన్ లోడ్ పడకుండా చూసినందుకు డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ జనరేషన్ ఇన్ డిస్కం అవార్డు
88.32 శాతం వినియోగదారులకు ఐఆర్డీఏ మీటర్లను అమర్చి మీటర్ రీడింగ్‌లో తప్పులు రాకుండా రెవెన్యూ బిల్లింగ్ కచ్చితంగా తీయడం, ఎస్ఎంఎస్ ద్వారా విద్యుత్తు బిల్లుల సమాచారం పంపించినందుకు ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్ అవార్డు