చుంచుపల్లి, మార్చి 16 : తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్- విద్యానగర్, కొత్తగూడెం ఆధ్వర్యంలో సోమవారం సభ్యులు జీఎంవీ ప్రసాదరావు, దండమూడి ధర్మారావు ఆర్థిక సహకారంతో విద్యానగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 కు సుమారు రూ.25 వేల విలువైన బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సెర్, రెండు కుర్చీలు, ఒక టేక్ వుడ్ ఆఫీసు టేబుల్ వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ఏడాది 20 అంగన్వాడీ కేంద్రాల్లో, మూడు ఆశ్రమాల్లో, హెల్త్ సెంటర్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే అసోసియేషన్ సభ్యులు 75 మంది ఉన్నారని, ప్రతి సభ్యుడి కుటుంబం నుండి ఒక సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా శాంతిశ్రీ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, వార్డు మెంబర్లు జకరయ్య, శంకర్, పత్రి రమ, పూర్ణ, సెక్రటరీ వెంకటేశ్వర్లు, పంచాయతీ సిబ్బంది అమర్నాథ్, రామకృష్ణ, కిశోర్, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, గ్రామ పెద్దలు, హెల్త్ సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.