హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. రాత్రి 8:30గంటల తర్వాత ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఫలితాల కోసం https://schooledu.te langana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అయితే కొంతసేపు సాంకేతిక కారణాలతో సైట్ మొరాయించడం గమనార్హం. కాగా సోమవారం రాత్రి 11:30 గంటలకు అకస్మాత్తుగా వెబ్సైట్లో అరగంట పాటు టెట్ ఫలితాలు ప్రత్యక్షమయ్యాయి.
వందలాది మంది(10%) అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకున్నారు కూడా. ఓ అరగంటకే అకస్మాత్తుగా వెబ్సైట్ నుంచి టెట్ ఫలితాలు తొలగించారు. మిగతా అభ్యర్థులు ఫలితాలు చెక్‌చేసుకుంటే ‘రిజల్ట్స్ డిసెబుల్’ అంటూ కనిపించింది. టీజీ ఆన్లైన్ అధికారులు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచినట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. టీజీ ఆన్లైన్ మీద క్రిమినల్ కేసు నమోదుచేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందిస్తూ టెస్ట్ ట్రయల్స్‌లో భాగంగా ఫలితాలు ప్రత్యక్షమయ్యాయని చెప్పారు. తాము అధికారికంగా ఫలితాలు విడుదల చేయలేదని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో మొత్తం 51.37% మంది అర్హత సాధించారు. పేపర్-1 ఎస్టీజీలు 72%, పేపర్-2 (గణితం, సైన్స్)లో 42.37%, పేపర్-2 (సోషల్ స్టడీస్)లో 35.86% మంది టెట్ క్వాలిఫై అయ్యారు. ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లు పేపర్-1లో 77.04%, పేపర్-2 (గణితం, సైన్స్)లో 49.13%, పేపర్-2 (సోషల్ స్టడీస్)లో 33.64% మంది టెట్‌లో అర్హత సాధించారు.