బోటనీ పాఠం చెప్పడంలో అమె దిట్ట. పీజీలో వృక్షశాస్త్రం చదివి బంగారు పతకం కొట్టింది మరి! ప్రొఫెసర్‌గా తన విద్యార్థులూ గోల్డ్ మెడల్ సాధించేలా పాఠాలూ చెప్పగలదు. విద్యార్థుల భవితవ్యం తీర్చిదిద్దుతున్నందుకు సంతోషంగా ఉన్నా.. ఇంకా ఏదో సాధించాలన్న తపన ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. ఆంత్రప్రెన్యూర్ అవతారం ఎత్తింది. ప్రయోగాత్మకంగా పుట్టగొడుగుల సాగు ప్రారంభించింది. అంచెలంచెలుగా వ్యాపారంపై పట్టు సాధించింది. ‘క్వాలిటీ’మష్రూమ్స్ సంస్థను స్థాపించి, ఎందరికోఉపాధి కల్పిస్తున్న తృప్తి భూషణ్ ధాకటే కథ.. ఆంత్రప్రెన్యూర్లకు సక్సెస్ లెక్చర్..
అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, అందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారన్నది ప్రధానం. మొహమాటాలకు పోయినా, అహంకారానికి తలొగ్గినా తొలి మలుపులోనే దక్కాల్సిన గెలుపు… కనుచూపు మేరలో కనబడకుండా పోతుంది. ఒక ప్రొఫెసర్ ఆంత్రప్రెన్యూర్‌గా మారాలనుకోవడంలో పెద్ద గొప్పలేదు. ఈ ప్రయాణంలో ఆమె తగ్గిన తీరు.. నెగ్గిన విధమూ.. మరెందరికో స్ఫూర్తినిస్తుంది.
తృప్తి ధాకటే నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి వృక్షశాస్త్రంలో పీజీ చేసింది. గోల్డ్‌మెడల్ సాధించి బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంది. ఎమ్మెస్సీ బయోటెక్నాజీ పూర్తిచేసి అందులోనూ ఫస్టుగా పాసైంది. డబుల్ పీజీ సాధించిన వారికి కొలువు దొరకడం ఈజీనే కదా! పైగా గోల్డ్‌మెడల్ స్టూడెంట్! వార్ధాలో జేబీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో అధ్యాపకురాలిగా ఉద్యోగం దొరికింది. తర్వాత డాక్టర్ డీవై పాటిల్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా పనిచేసింది. భూషణ్‌తో వివాహం తర్వాత శంభాజీ నగర్లో కొత్త కాపురం మొదలైంది. అక్కడే అగ్రిజెన్ బయోటెక్‌లో కొన్నాళ్లు పనిచేసింది.
ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడే నత్తగుల్లలు, మిల్కీ మష్రూమ్స్‌పై రకరకాల పరిశోధనలు చేసింది తృప్తి. అప్పుడే పుట్టగొడుగుల వ్యాపారం చేయాలన్న బీజం ఆమె మనసులో నాటుకుంది. అప్పటికే యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తృప్తికి ప్రభుత్వ అధ్యాపకురాలి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే.. తేలిగ్గానే విజయం సాధించేదే! కానీ, ఆమె పుట్టగొడుగులపై మనసు పారేసుకుంది. ఎలాగైనా మష్రూమ్స్ వ్యాపారం చేపట్టాలన్న నిశ్చయానికి వచ్చింది. భర్త కూడా ఓకే అనడంతో అధ్యాపక వృత్తికి స్వస్తిపలికి.. ఆంత్రప్రెన్యూర్‌గా అవతారమెత్తింది.
2018లో రూ.3.50 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించింది తృప్తి. పూణెలోని ధాయరీ ప్రాంతంలో రెండువేల గజాల స్థలాన్ని లీజుకు తీసుకుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పుట్టగొడుగు విత్తనాలు సేకరించి 20 బెడ్స్‌పై పెంపకం మొదలుపెట్టింది. ఆరు వారాలు గడిచాయి. తొలి పంటగా 20 కిలోల మష్రూమ్స్ చేతికి అందాయి. వాటిని విక్రయిస్తే మహా అయితే రూ.8,000 వస్తాయి. ఎన్నివారాలు గడిస్తే, ఎన్ని పంటలు తీస్తే పెట్టుబడి మీద వడ్డీ అయినా వస్తుంది? తృప్తి కూడా ఇలాగే ఆలోచించి ఉంటే.. మరోవారం తిరక్కుండానే వ్యాపారానికి స్వస్తి పలికేది! ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి కదా! అయితే, ఈ ఇరవై కిలోల మష్రూమ్స్ ఎవరికి అమ్మాలి? ఎక్కడ అమ్మాలో ఆమెకు పాలుపోలేదు.
సరిగ్గా మార్కెటింగ్ చేయకుంటే.. ఎంత ఉత్పత్తి సాధించి ఏం ప్రయోజనం? అనుకుందామె. అందుకే తను పండించిన మష్రూమ్స్‌తో రుచికరమైన కూరలు వండి, క్యారేజీలో సర్దుకొని పూణె శివారులోని కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. అక్కడున్న రైతులు, కూరగాయల విక్రేతలకు మధ్యాహ్న భోజనంలోకి కొసరి కొసరి మష్రూమ్స్ కూరను వడ్డించింది. అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. ఒకప్పటి ప్రొఫెసర్ అని భేషజానికి పోలేదు. వారితో మమేకమైంది. తను పండించే మష్రూమ్స్ టోకుగా ఇస్తాననీ, అమ్మి సొమ్ము చేసుకోవాలని వారితో ఒప్పందానికి వచ్చింది. ఇలా మార్కెటింగ్ టెక్నిక్స్‌తో తొలి విజయం సాధించింది తృప్తి.
నెలలు గడుస్తున్నాయి. మష్రూమ్స్ ఉత్పత్తి పెరగడమూ మొదలైంది. ఎంత పెరిగినా.. ఆర్థికంగా ఒడుదొడుకులు తప్పడం లేదు! అయినా భరించింది. భర్త సహకారం, తను ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడబెట్టుకున్న ధనం ఈ సమయంలో ఆమెకు అక్కరకు వచ్చాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్వాలిటీ విషయంలో రాజీపడొద్దు అనుకుంది. ‘క్వాలిటీ’ బ్రాండ్ పేరుతో మష్రూమ్స్ విక్రయించడం మొదలుపెట్టింది. ఉత్పత్తి కేంద్రం విస్తీర్ణాన్ని నాలుగువేల చదరపు అడుగులకు పెంచింది. వంద బెడ్స్‌పై పుట్టగొడుగుల సాగు చేపట్టింది. ఇలా ఆమె వ్యాపారం కుదురుకుంటున్న సమయంలో కరోనా కల్లోలం మొదలైంది. కొవిడ్ కాలం అన్ని వ్యాపారాలను దెబ్బతీసింది. పోషకాల గనులుగా పేరున్న పుట్టగొడుగుల మార్కెటింగ్‌కు ఈ ఆపత్కాలమే సరైనదని భావించింది తృప్తి.
ప్రపంచమంతా సోషల్ మీడియాకు బదిలీ అయిన ఈ తరుణంలో తన ఉత్పత్తులకు ఆన్లైన్లో ఇబ్బడిముబ్బడిగా ప్రచారం కల్పించింది. లాక్డౌన్ టైమ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి వెబినార్లలో పాల్గొంటూ… ‘క్వాలిటీ’ బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది. ఎన్ని రోజులని ఇలా పుట్టగొడుగులు నేరుగా అమ్మడం అనుకుంది తృప్తి. వాటితో కుక్కీలు, పాపడాలు, బిస్కెట్లు ఇలా రకరకాల పదార్థాల తయారీ చేపట్టింది. ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్‌తోపాటు రిటైల్ స్టోర్స్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇలా కరోనా సద్దుమణిగే సమయానికి ‘క్వాలిటీ’ బ్రాండ్ పూణెతోపాటు చుట్టుపక్కల పట్టణాల్లోనూ వేళ్లూనుకుంది. ఒకప్పుడు ఇరవై కిలోలు అమ్మడానికి నానా అగచాట్లు పడ్డ ఆమె.. ఇప్పుడు రోజుకు వందల కిలోల పంట తీస్తున్నది. ఈ వ్యవస్థను నిర్వహించడానికి పదుల సంఖ్యలో ఉద్యోగస్తులను నియమించుకుంది. వాళ్లలో మహిళా ఉద్యోగులే అధికం. అలా ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి చేరుకుంది.
మరోవైపు పూణె-సతారా రహదారి వెంట ఉంబరే గ్రామంలో పదివేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది తృప్తి. ఇది పుట్టగొడుగుల సాగు కోసం తీసుకున్నది కాదు! వృథాగా మిగిలిపోయిన మష్రూమ్స్‌తో కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి. ఆవు పేడ, కుళ్లిపోయిన మష్రూమ్స్, వానపాములను పొరలు పొరలుగా వేసి… వర్మి కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు. సహజ సిద్ధమైన ఈ ఎరువును కొనుగోలు చేయడానికి పరిసర గ్రామాల్లోని రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా తన వ్యాపారాన్ని జీరో వేస్టేజీగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు.. అదనపు ఆదాయాన్ని సంపాదించడం మరింత సంతృప్తిగా ఉందటున్నది తృప్తి.
– పాసికంటి శంకర్, భివండీ